అగ్రరాజ్య ఆర్థికవ్యవస్థ మందగించింది!

27 Jan, 2017 20:54 IST|Sakshi
అగ్రరాజ్య ఆర్థికవ్యవస్థ మందగించింది!
వాషింగ్టన్ : అమెరికా ఆర్థికవ్యవస్థ మందగించింది. అనుకున్న లక్ష్యం 3 శాతం వార్షిక వృద్ధిని చేధించడంలో విఫలమైంది. శుక్రవారం కామర్స్ డిపార్ట్మెంట్ విడుదల చేసిన 2016 నాలుగో క్వార్టర్ రిపోర్టులో అమెరికా ఆర్థికవ్యవస్థ 1.9 శాతం వృద్ధిని మాత్రమే నమోదుచేసింది. అయితే నాలుగో క్వార్ట్రర్లో 2.2 శాతం వృద్ధి నమోదుచేస్తుందని ఆర్థికవేత్తలు అంచనావేశారు. వారి అంచనాలన్నీ తలకిందులయ్యాయి. అంతేకాక మూడో క్వార్టర్లో నమోదుచేసిన 3.5 శాతం వృద్ధి రేటు నుంచీ ఈ రేటు కిందకి దిగజారింది.
 
ఎగుమతులు తగ్గడంతోనే నాలుగో క్వార్టర్లో వృద్ధి రేటు పడిపోయిందని గణాంకాల్లో తెలిసింది. ఎగుమతుల్లో ఎక్కువగా నమోదుచేసే సోయాబీన్స్ సరుకు రవాణా పడిపోయినట్టు రిపోర్టులు పేర్కొన్నాయి. మూడో క్వార్టర్లో 10 శాతం పెరిగిన ఎగుమతులు, ఈ క్వార్టర్లో 4.3 శాతానికి పడిపోయాయి. 2015 మొదటి క్వార్టర్ నుంచి మొదటిసారి ఈ క్వార్టర్లో ఎగుమతులు క్షీణించాయి. అయితే వినియోగదారుల వ్యయం, వ్యాపార పెట్టుబడులు పెంపు ఆర్థికవ్యవస్థ మళ్లీ పెరగడానికి దోహదం చేస్తాయని రిపోర్టులు పేర్కొంటున్నాయి.. ఏడాది మొత్తంగా అమెరికా కేవలం 1.6 శాతం మాత్రమే వృద్ధి చెందింది. ఇది 2015లో నమోదుచేసిన 2.6 శాతం కంటే తక్కువ.   
 
వృద్ధి రేటు మందగించడం అగ్రదేశానికి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన డొనాల్డ్ ట్రంప్కు అతిపెద్ద సవాలుగా మారింది. ఎకానమీని మళ్లీ పుంజుకునేలా చేయడానికి పన్ను రేట్లలో కోతలు, నిబంధనలు సరళతరం, పబ్లిక్ వర్క్స్పై ఎక్కువగా వెచ్చిచడం చేస్తానని ఎన్నికల ప్రచారంలోనే ట్రంప్ వాగ్దానం చేశారు. అయితే ట్రంప్ చేసిన వాగ్దానాలన్నీ అమల్లోకి రావడానికి మరికొంత కాలం పడుతుందని ఆర్థికవేత్తలంటున్నారు. ఒకవేళ ట్రంప్ తన పనుల్లో వేగాన్ని పెంచితే  అమెరికా ఎకానమీ 2 శాతానికి పెరుగనుందని లేదా మరింత వేగంగా వృద్ధి చెందుతుందనే అంచనాలూ వెలువడుతున్నాయి. 
మరిన్ని వార్తలు