ఐసిస్ చీఫ్ కు మానవ బాంబే రక్ష!

17 Nov, 2016 17:42 IST|Sakshi
ఐసిస్ చీఫ్ కు మానవ బాంబే రక్ష!

ఇర్బిల్: ఐసిస్ కు ఆయువు పట్టైన ఇరాక్ లోని మోసుల్ నగరాన్ని ఇరాక్, కుర్దిష్, అమెరికన్ దళాలు చుట్టుముట్టినా.. ఆ సంస్ధ అధినేత అబు బాకర్ అల్ బాగ్దాదీ అక్కడ నిశ్చింతగా మనగలుగుతున్నాడు. ఇందుకు రెండు ప్రధాన కారణాలు ఉన్నాయని ఓ మీడియా సంస్ధ పేర్కొంది. ఒకటి బాగ్దాదీకి నమ్మిన బంటులు(ఐసిస్ తో ఎలాంటి సంబంధం లేని వారు) భద్రతా దళాల కదలికలను ఎప్పటికప్పుడు ఆయనకు చేరవేస్తున్నారట. 

దీంతో అండర్ గ్రౌండ్ లో తలదాచుకుంటున్న ఆయన దళాల కదలికలు బట్టి భూమి లోపల ఉన్న సొరంగ మార్గాల ద్వారా మకాం మారుస్తున్నట్లు తెలిసింది. రెండోది ఒక వేళ భద్రతా దళాల చేతికి చిక్కే అవకాశం ఉంటే అక్కడికక్కడే ప్రాణాలు విడవాలని ఆయన నిర్ణయించున్నారట. ఇందుకు కోసం ఒక మానవబాంబును ఎల్లప్పుడూ తనకు అంటిపెట్టుకుని ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. నిద్రపోయే సమయంలో కూడా మానవబాంబును బాగ్దాదీ తన శరీరంపై నుంచి తీయడం లేదని తెలిసింది.

గతంలో అనుచరులతో నవ్వుతూ మాట్లాడే బాగ్దాదీ ప్రస్తుతం వారు ఎదురుగా వస్తే అనుమానంగా చూస్తున్నారని ఓ మీడియా సంస్ధ పేర్కొంది. అంతేకాకుండా సొంత వారైనా కూడా అనుమానం వస్తే ఉరి తీయిస్తున్నారని తెలిపింది. అనుమానితులను బాగ్దాదీ చంపిస్తున్న తీరు మరింత క్రూరంగా తయారయింది. గతంలో ఉరి తీయడమో లేక కాల్చి చంపడమో చేసిన ఐసిస్ ఉగ్రవాదులు.. భద్రతా దళాలకు ఫోన్ల ద్వారా సమాచారం అందిస్తున్న 58 మందిని బోన్లలో బంధించి నీటిలో ముంచి చంపారు. 

ఇరాక్ లో ఐసిస్ వేళ్లూనుకుపోవడానికి ప్రధాన కారణం 'కబ్స్ ఆఫ్ కాలిఫేట్'. కబ్స్ ఆఫ్ కాలిఫేట్ అంటే దైవుని పిల్లలు అని అర్ధం. ఇరాక్ లోని చిన్న పిల్లలను రహస్య సమాచారం చేరవేయడానికి ఐసిస్ ఉపయోగించుకుంటుంది. దేశంలోని ప్రతి ఇంట్లోని చిన్న పిల్లల్లో ఒకరు ఐసిస్ గూఢచారిగా పనిచేస్తున్నారు. యువకులపై నిఘా పెట్టి వారి కదలికలను ఎప్పటికప్పుడు ఐసిస్ ఉగ్రవాదులకు చేరవేయడం వీరి విధి. రెండేళ్ల క్రితం మోసుల్ నగరంలో బగ్దాదీ కాలిఫేట్(ముస్లింలకు దైవం)గా తనను తాను ప్రకటించుకున్న విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు