డిపాజిట్ల సమీకరణ కష్టమే

3 Aug, 2013 01:43 IST|Sakshi
D Sarkar

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో:  ప్రస్తుతం డిపాజిట్ల సమీకరణ అనేది బ్యాంకులకు సవాలుగా మారిందని యూనియన్ బ్యాంక్ సీఎండీ డి.సర్కార్ పేర్కొన్నారు. రెండు రోజుల పర్యటన కోసం హైదరాబాద్ వచ్చిన ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ ప్రజలు ఇతర పెట్టుబడి సాధనాల వైపు చూస్తుండటంతో డిపాజిట్ల సేకరణ కష్టంగా ఉందన్నారు.
 
 కొత్తగా శాఖలను పెంచుకోవడం, గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళడం ద్వారా తక్కువ వ్యయం ఉన్న డిపాజిట్ల సేకరణపై తాము అధికంగా దృష్టిసారిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో డిపాజిట్లపై వడ్డీరేట్లను పెంచే ఆలోచన లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 300 శాఖలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా రాష్ర్టంలో 22 శాఖలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది డిపాజిట్లలో 14-15%, రుణాల్లో 15-16% వృద్ధిని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది వ్యాపార విస్తరణకు రూ.3,000 కోట్ల అదనపు మూలధనం అవసరమవుతుందని అంచనా వేయగా, ఇందులో రూ.1,800 కోట్లు ప్రభుత్వం సమకూరుస్తుందని, మిగిలిన మొత్తం వివిధ మార్గాల ద్వారా సేకరించే యోచనలో ఉన్నట్లు తెలిపారు. విదేశీ విస్తరణపై దృష్టిసారించామని లండన్, సిడ్నీ, బెల్జియంలలో శాఖలను ప్రారంభించడానికి ఆర్‌బీఐ అనుమతి కోసం ఎదురుచూస్తున్నట్లు సర్కార్ తెలిపారు.

మరిన్ని వార్తలు