బడ్జెట్ ముహుర్తం ఆ రోజే!

15 Nov, 2016 18:16 IST|Sakshi
బడ్జెట్ ముహుర్తం ఆ రోజే!
కేంద్ర బడ్జెట్ ముహుర్తం దాదాపు ఖరారైనట్టు రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్రం సాధారణ బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నట్టు తెలిసింది. పాత సంప్రదాయానికి భిన్నంగా ఈసారి నెల రోజుల ముందే కేందం బడ్జెట్ను పార్లమెంటులో ప్రవేశపెట్టబోతోంది. వచ్చే ఏడాది(2017-18) నిర్వహించబోయే ఈ బడ్జెట్ సమావేశాలూ జనవరిలోనే ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల తేదీల అనంతరం వచ్చే ఏడాది నిర్వహించబోయే ఈ సమావేశ తేదీలను ప్రభుత్వం ఖరారుచేసినట్టు సమాచారం. ఈ ఏడాది పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ 16 నుంచి డిసెంబర్ 16వరకు జరుగనున్నాయి.
 
ఈ సారి బడ్జెట్లో మరో విశేషమేమిటంటే ప్రత్యేక రైల్వే బడ్జెట్ కూడా సాధారణ బడ్జెట్లో కలిపి తీసుకురావడమే. 92ఏళ్ల నాటి నుంచి వస్తున్న ప్రత్యేక రైల్వే బడ్జెట్ సాంస్కృతికి చరమగీతం పాడిన కేంద్రప్రభుత్వం, ఈ బడ్జెట్ను సాధారణ బడ్జెట్లో కలపడానికి ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. రెండు బడ్జెట్లను ప్రభుత్వం కలిపి ప్రవేశపెడుతున్నందున్న, డివిడెంట్ రూపంలో చెల్లించే రూ.9,700 కోట్ల రూపాయలను భారత రైల్వే ఖజానా పొదుపు చేసుకోనుంది. పార్లమెంట్లో ప్రవేశపెట్టబోయే ఈ బడ్జెట్ మొత్తం విలువ ఈసారి రూ. 20,32,650 కోట్లగా ఉండనుందని తెలుస్తోంది.
 
ప్రతిసారి రైల్వే బడ్జెట్ను ప్రవేశపెట్టిన అనంతరం ఆర్థిక సర్వేను, సాధారణ బడ్జెట్ను ప్రభుత్వం ప్రవేశపెడుతూ వస్తోంది.  బడ్జెట్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆర్థిక అంశమైనందున దానిని ఎప్పుడైనా పార్లమెంట్లో ప్రవేశపెట్టుకోవచ్చని ఓ వైపు కేంద్ర ఎన్నికల సంఘం కూడా స్పష్టతనిచ్చింది. దీంతో ఫిబ్రవరి1నే దేశ ప్రజల ముందుకు బడ్జెట్ లెక్కలు రాబోతున్నాయి. 

 

మరిన్ని వార్తలు