ఆ అమ్మాయి రాజకీయాలు మానేస్తే మంచిది

28 Feb, 2017 12:44 IST|Sakshi
ఆ అమ్మాయి రాజకీయాలు మానేస్తే మంచిది

న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్శిటీ విద్యార్థిని గుర్‌మెహర్‌ కౌర్‌ రాజకీయాలు మానేసి చదువుపై దృష్టిపెట్టాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరెణ్‌ రిజిజు హితవు పలికారు. గుర్‌మోహర్‌ తీరుతో ఆమె తండ్రి, కార్గిల్ అమరవీరుడు మణ్‌దీప్ సింగ్ ఆత్మ క్షోభిస్తుందని అన్నారు. దేశంలో ఎవరైనా ఏమైనా మాట్లాడవచ్చని, కానీ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడొద్దని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.

గుర్‌మెహర్‌ తండ్రి కెప్టెన్ మణ్‌దీప్ సింగ్ 1999 కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందారు. గుర్‌మెహర్ ఇటీవల.. తన తండ్రిని పాకిస్థాన్ చంపలేదని, యుద్ధ చంపిందని రాసిన ఫ్లకార్డ్ చేతబట్టుకుని ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వ్యాఖ్యలను నెటిజెన్లు, కొందరు సెలబ్రిటీలు తప్పుపట్టారు. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి స్పందించారు.

గుర్‌మెహర్‌ ఫిర్యాదుపై కేసు నమోదు: తనను రేప్ చేసి చంపేస్తామని బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ గుర్‌మెహర్ చేసిన ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఢిల్లీ రాంజాస్ కాలేజిలో బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీ కార్యకర్తలు చేసిన దాడిని ఖండిస్తూ గుర్‌మెహర్ సోషల్ మీడియాలో చేసిన పోస్టింగ్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఏబీవీపీకి భయపడనని, తాను ఢిల్లీ యూనివర్శిటీ విద్యార్థినినంటూ పోస్ట్ చేసింది. ఆ తర్వాత ఏబీవీపీ నాయకులు తనను బెదిరించారని ఆమె ఆరోపించింది.

మరిన్ని వార్తలు