వర్సిటీల్లో ర్యాగింగ్‌పై నిఘా!

15 Aug, 2015 02:55 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: గుంటూరు ఆచార్య నాగార్జునవర్సిటీ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్యకు ర్యాగింగ్ వేధింపులే కారణాలుగా తేలిన నేపథ్యంలో ర్యాగింగ్ నిరోధానికి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థుల క్రమశిక్షణా రాహిత్యం, ర్యాగింగ్, తరగతులకు గైర్హాజరు, వర్సిటీ కాలేజీల్లోకి అసాంఘిక శక్తుల ప్రవేశం తదితర చర్యల కట్టడికి ఉపక్రమిస్తున్నట్లుగా ప్రకటించింది. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ శుక్రవారం జీఓ నెంబర్ 398 విడుదల చేసింది. దీని ప్రకారం అన్ని యూనివర్సిటీ కాలేజీల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలి. విద్యార్థుల హాజరుకు బయోమెట్రిక్ యంత్రాలు తప్పనిసరిచేయాలి.

ఈ మేరకు నిర్ణీత శాతం హాజరు ఉన్న విద్యార్థులకు మాత్రమే ఫీజు రీయింబర్స్‌మెంటు, స్కాలర్‌షిప్పులను మంజూరు చేయాలి. బయటి వ్యక్తులు వర్సిటీల్లో ప్రవేశించకుండా చర్యలు తీసుకోవాలి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ ఆగస్టు 31వ తేదీనాటికి పూర్తి కావాలని అన్ని యూనివర్సిటీల ఉపకులపతులను ప్రభుత్వం ఆదేశించింది.

>
మరిన్ని వార్తలు