సినిమా పిచ్చోళ్లకు షాక్!

16 Oct, 2014 05:08 IST|Sakshi
సింగం, దబాంగ్ చిత్రాల్లో అజయ్ దేవగన్, సల్మాన్ ఖాన్

సినిమాల ప్రభావం సామాన్య జనంపైనేకాదు పోలీసుల మీదా పడింది. 'రీల్ పోలీసు'ను గుడ్డిగా అనుకరించి ఉత్తరప్రదేశ్ లో ఇద్దరు రియల్ పోలీసులు సస్పెన్షన్ కు గురయ్యారు. ఇటీవల కాలంలో పోలీసు సినిమాల జోరు పెరిగింది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుండడంతో సినిమా రూపకర్తలు 'ఖాకీ' మంత్రం జపిస్తున్నారు. పోలీసు ఫార్ములాతో వచ్చిన సినిమాలు వరుసగా విజయాలు సాధించడంతో ఈ ట్రెండ్ కు మరింత ఊపు వచ్చింది.

సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన 'దబాంగ్', దానికి కొనసాగింపుగా వచ్చిన సినిమాలు అతడి కెరీర్ లో మైలురాళ్లుగా నిలిచాయి. ఇక అజయ్ దేవగన్ ఇమేజ్ ను ఒక రేంజ్ కు తీసుకెళ్లిన సినిమా సింగం. ఈ సినిమాలు ఉత్తరాదిని ఒక ఊపు ఊపాయి. ఈ చిత్రాల్లోని హీరోలను అనుకరించి ఆగ్రాకు చెందిన ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లు శ్రీముఖం అందుకున్నారు. సినిమా పిచ్చిని ఒంటబట్టించుకుని మనీష్ సోలాంకి, భూపేంద్ర సింగ్ అనే ఇద్దరు కానిస్టేబుళ్లు ఉన్నతాధికారికి చిక్కారు.

వీరిలో ఓ కానిస్టేబుల్ నల్లద్దాల కళ్లజోడు పెట్టుకుని హీరో ఫోజు పెట్టాడు. మరో కానిస్టేబుల్ సినిమా స్టైల్లో బిగుతు ప్యాంట్ వేసుకొచ్చాడు. ఉన్నతాధికారి తనిఖీకి వచ్చినప్పుడు ఈ విషయం బయటపడడంతో వారిద్దరిని సస్పెండ్ చేశారు. నిర్దేశిత పోలీసు యూనిఫాం నియమాలు ఉల్లంఘించినందుకు వీరిపై చర్యతీసుకున్నారు. పోలీసు నియమావళిని కాదని 'దబాంగ్, సింగం' తరహాలో వచ్చినందుకు వేటు వేశారు. క్రమశిక్షణ ఉల్లంఘన, అవిధేయతను సహించబోమంటూ క్లాస్ తీసుకున్నారు. డిపార్ట్మెంట్ లో మంచిపేరున్నప్పటికీ 'సినిమా వేషాలు' మనీష్, భూపేంద్రలకు షాక్ ఇచ్చాయి.

మరిన్ని వార్తలు