సీఎం యోగి మరో సంచలన నిర్ణయం

16 Jun, 2017 09:28 IST|Sakshi
సీఎం యోగి మరో సంచలన నిర్ణయం

యూపీలో సున్నీ, షియా వక్ఫ్‌ బోర్డులు రద్దు

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని సున్నీ, షియా వక్ఫ్‌ బోర్డులను రద్దు చేస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ గురువారం సంచలన నిర్ణయం తీసుకున్నారు. వక్ఫ్‌ బోర్డుల ఆస్తుల విషయంలో తీవ్ర అవినీతి ఆరోపణలు రావడంతోనే ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూపీ వక్ఫ్‌ మంత్రి మొహసీన్‌ రజా మీడియాకు తెలిపారు.

బోర్డుల రద్దుకు ముందు అన్ని న్యాయపరమైన అంశాలను పరిశీలించినట్లు వెల్లడించారు. వక్ఫ్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా(డబ్ల్యూసీఐ) జరిపిన విచారణలో కూడా ఈ రెండు బోర్డుల్లో తీవ్ర అవకతవకలు చోటుచేసుకున్నట్లు తేలిందని రజా పేర్కొన్నారు. ఈ అవినీతిలో సమాజ్‌వాదీ పార్టీ సీనియర్‌ నేత, యూపీ మాజీ మంత్రి అజాం ఖాన్‌తో పాటు షియా బోర్డు చైర్మన్‌ వసీమ్‌ రజ్వీల పాత్ర ఉన్నట్లు డబ్ల్యూసీఐ నిర్ధారించిందని వెల్లడించారు. మౌలానా జొహర్‌ అలీ ఎడ్యుకేషన్‌ పేరిట ట్రస్ట్‌ను ఏర్పాటు చేసిన అజాం ఖాన్‌.. వక్ఫ్‌ ఆస్తుల్ని దానికి మళ్లించారని రజా ఆరోపించారు.

ఈ రెండు సంస్థల్లో చోటు చేసుకున్న కోట్లాది రూపాయల అక్రమాలు జరిగినట్టు వచ్చిన ఆరోపణలపై సీబీఐ దర్యాప్తుకు లేఖ రాసినట్టు వెల్లడించారు. వక్ఫ్‌ బోర్డులను రద్దు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా అని మంత్రిని ప్రశ్నించగా... 1995 వక్ఫ్‌ బోర్డు చట్టం ఈ హక్కు కల్పిస్తోందని సమాధానమిచ్చారు. చట్టబద్ధంగానే తాము వ్యవహరించామని చెప్పారు. వక్ఫ్‌ బోర్డుల రద్దు ప్రక్రియ పూర్తైన తర్వాత శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు. వక్ఫ్‌ బోర్డులకు కొత్త పాలక మండలిని లేదా అధికారిని నియమిస్తామని తెలిపారు.

మరిన్ని వార్తలు