వారందరూ కొట్లాటలో బిజీగా ఉన్నారు

5 Nov, 2016 19:17 IST|Sakshi
వారందరూ కొట్లాటలో బిజీగా ఉన్నారు
ఉత్తరప్రదేశ్లో అధికార పార్టీ అభివృద్ధిని పక్కన పెట్టి, ఒక్కరినొక్కరూ కొట్టుకోవడంలో బిజీగా ఉన్నారని బీజేపీ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా విమర్శించారు. ఓ వైపు బాబాయ్ శివపాల్ యాదవ్, మరోవైపు అబ్బాయ్ అఖిలేష్ యాదవ్లు కొట్టుకుంటుంటే,  బహుజన సమాజ్ పార్టీ సుప్రిం మాయావతి దుర్వినియోగాలకు పాల్పడుతున్నారని వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్ 2017 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శనివారం ఆయన భారతీయ జనతా పార్టీ పోల్ క్యాంపెయిన్ 'పరివర్తన యాత్ర'ను సహారన్పూర్లో ప్రారంభించారు. ఈ ప్రచారంలో భాగంగా యాదవ్ ప్యామిలీ, బీఎస్పీ అధినేత మాయవతిపై అమిత్షా విరుచుకుపడ్డారు.
 
ఎస్పీ, బీఎస్పీలు  ఉత్తరప్రదేశ్లో శాంతిభద్రతలను మెరుగుపరచడంలో విఫలమవుతున్నాయని, కేవలం బీజేపీ మాత్రమే యూపీలో దౌర్జన్యాలను అరికడుతుందన్నారు. యూపీని అభివృద్ధి పథంలో ముందజంలో నిలిపేందుకు కేవలం ఒక్క బీజేపీ పార్టీనే ఎంతగానో శ్రమించిందని, ఈ ఎన్నికల్లో తమ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. త్రిపుల్ తలాక్ రద్దును సమర్థించిన ఆయన, ముస్లిం మహిళలు తమ హక్కులను పూర్తిగా సద్వినియోగం చేసుకునే అవకాశం ఉందని చెప్పారు.  మహిళల హక్కులపై ఓటు బ్యాంకు రాజకీయాలు చేయొద్దని ప్రతిపక్షాలను ఆయన హెచ్చరించారు.
 
వన్ ర్యాంకు వన్ పెన్షన్పై, మాజీ సైనికోద్యోగి రామ్ కిషన్ ఆత్మహత్యపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రాజకీయ నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. దశాబ్దాలుగా కాంగ్రెస్ పెండింగ్లో పెట్టిన ఈ విధానాన్ని బీజేపీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిందని గుర్తుచేశారు. జవాను మృతిచెందడాన్ని కూడా ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకోవడం నిజంగా చాలా అసహ్యకరంగా ఉందని విమర్శించారు.అమిత్ షా నిర్వహించిన ఈ యాత్రలో హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కట్టర్, కల్రాజ్ మిశ్రా, కేశల్ ప్రసాద్ మౌర్య, సంజీవ్ బల్యాన్, సంగీత్ సోమ్లతో పాటు బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. 
మరిన్ని వార్తలు