విద్యానిధి.. హతవిధీ!

2 Apr, 2017 01:58 IST|Sakshi
విద్యానిధి.. హతవిధీ!

- వీసాలు తిరస్కరించిన అమెరికన్‌ కాన్సులేట్‌
- అమెరికాలో ఉన్నత విద్య కలలు కల్లలు
- దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు నిరాశ
- తాజాగా 55 మందికి వీసాలు నిరాకరణ
- అంతా విద్యానిధి పథకం లబ్ధిదారులే..
- అన్ని వివరాలు సరిగా ఉన్నా కూడా నో!
- బదులుగా ఆస్ట్రేలియా వైపు చూస్తున్న విద్యార్థులు
- విద్యానిధి పథకం దరఖాస్తుల్లో మార్పు కోసం సంక్షేమ శాఖలకు వినతులు  


ఎల్బీనగర్‌కు చెందిన రేఖ గతేడాది బీటెక్‌ పూర్తి చేసింది. ఎమ్మెస్‌ చదివేందుకు అమెరికాలోని కన్సాస్‌ వర్సిటీకి దరఖాస్తు చేసుకుంది. అమెరికా వర్సిటీలో సీటు వచ్చింది.. విద్యానిధి పథకం కింద రూ.20 లక్షల ఆర్థిక సాయానికి ఎంపికైంది. కానీ అమెరికా కాన్సులేట్‌ రేఖ వీసాకు నిరాకరించింది. కాన్సులేట్‌ అధికారులు అడిగిన ప్రశ్నలకు సరిగ్గా సమాధానం చెప్పినా, అన్ని సరిగా ఉన్నా వీసా తిరస్కరించారు. ఎందుకు తిరస్కరించారనే కారణమూ చెప్పలేదు. రేఖ మాత్రమే కాదు మరో 55 మందికి ఇదే పరిస్థితి ఎదురైంది. వీసాల జారీలో అమెరికా కాన్సులేట్‌ అధికారులు వ్యవహరిస్తున్న తీరుతో.. రాష్ట్ర విద్యార్థుల ఆశలన్నీ అడియాసలవుతున్నాయి.

సాక్షి, హైదరాబాద్‌: విద్యార్థుల అమెరికా కలలు కల్లలవుతున్నాయి. వీసాల జారీలో అమెరికా కఠినంగా వ్యవహరిస్తుం డడం, కావాలనే తిరస్కరిస్తుండడంతో వారి ఆశలు ఆవిరవుతున్నాయి. ఇటీవల మహాత్మాజ్యోతి బాపూలే విద్యానిధి కింద ఎంపికైన పలువురు విద్యార్థులు.. అమెరికాలో ఎమ్మెస్‌ చదివేందుకు వివిధ యూనివర్సిటీలకు దరఖాస్తు చేసుకున్నారు. ఆయా వర్సిటీలు సీట్లు ఇచ్చేందుకు ఓకే చెప్పినా.. అమెరికన్‌ కాన్సులేట్‌ మాత్రం వీసాల జారీకి నిరాకరించిం ది. ఇలా తిరస్కరించడానికి కాన్సులేట్‌ అధికారులు ఎలాం టి కారణాలూ వెల్లడించకపోవడం గమనార్హం. అటు విద్యార్థులు మాత్రం కన్నీటితో ఆందోళనలో మునిగిపోతున్నారు.

విద్యానిధి లబ్ధిదారులకు షాక్‌!
రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల్లోని పేద విద్యార్థుల కోసం ఓవర్సీస్‌ విద్యానిధి పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద ఎంపికైన లబ్ధిదారులకు రూ.20 లక్షల వరకు ఆర్థిక సహకారాన్ని అందిస్తోంది. బీసీ కేటగిరీకి చెందిన విద్యార్థులకు గతేడాది నుంచి ఈ పథకం అందుబాటులోకి రాగా.. వారికి అమెరికాలో చదివే అవకాశాన్ని కల్పించింది. 2016–17లో రాష్ట్రవ్యాప్తంగా 300 మందికి ఆర్థిక సహకారం అందించేలా నిధులు కేటాయించినా.. పథకం అమల్లో జాప్యం, ప్రచారం పెద్దగా లేకపోవడంతో 203 దరఖాస్తులే వచ్చాయి. అందులోనూ అర్హత ఉన్న 110 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. వారిలో 90 మందికి సంబంధించి ప్రొసీడింగ్‌లను బీసీ సంక్షేమ శాఖ వెబ్‌సైట్‌లో పొందుపర్చింది. వారిలో 70 మంది అమెరికా యూనివర్సిటీలనే ఎంపిక చేసుకున్నారు. విద్యానిధి పథకానికి ఎంపికకావడంతో ఆయా విద్యార్థులు.. అమెరికా వీసా కోసం ఇంటర్వూ్యలకు వెళ్లారు. కానీ అందులో దాదాపు 55 మందికి వీసా తిరస్కరణకు గురైనట్లు సమాచారం. ఇంటర్వూ్యలో ‘ఏ కోర్సు చేయాలనుకుంటున్నావు..? ఎందుకు ఆ కోర్సు ఎంపిక చేసుకున్నావు..?’వంటి ప్రశ్నలు అడిగారని, వాటికి çసరిగానే బదులిచ్చినా వీసా  తిరస్కరించారని రేఖ అనే అభ్యర్థి వాపోయింది. జీఆర్‌ఈ స్కోర్‌తో పాటు ఎంపిక చేసుకున్న కోర్సుకు సంబంధించి సరైన వివరాలు ఇచ్చానని, వీసా ఎందుకు రాలేదో తెలియడం లేదని మరో విద్యార్థిని ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా వెళ్లే చాలామందికి ఇలాగే ఉద్దేశపూర్వకంగా వీసా తిరస్కరిస్తున్నారని వారు వ్యాఖ్యానించారు.

ఆస్ట్రేలియా వైపు చూపు
అమెరికాలో ఉన్నత విద్యకు అడ్డంకులు ఎదురవుతున్న తరుణంలో ఆస్ట్రేలియా యూనివర్సిటీల వైపు విద్యార్థులు దృష్టి సారిస్తున్నారు. ఇటీవల వీసా తిరస్కరణకు గురైన పలువురు విద్యానిధి లబ్ధిదారులు ఆస్ట్రేలియా, కెనడా వర్సిటీల్లో చదివేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆర్థిక సహకార పథకం కింద అమెరికా వర్సిటీ పేర్లు నమోదు చేసిన నేపథ్యంలో.. వాటిని మార్చాలంటూ బీసీ సంక్షేమ శాఖకు విజ్ఞప్తులు చేస్తున్నారు. దీనిపై అధికారులు సైతం సానుకూలంగా స్పందిస్తూ.. ఈ అంశంపై ప్రభుత్వానికి నివేదిస్తా మని పేర్కొంటున్నారు. మరోవైపు విద్యా నిధి పథకం కింద ఎంపికైనట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఉత్తర్వులను ఆస్ట్రేలియా యూనివర్సిటీల్లో పరిగణనలోకి తీసుకుంటున్నారని, ఫీజు చెల్లింపులకు కొంత గడువు ఇస్తున్నారని విద్యార్థులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు