బిక్రమ్‌ చౌదరికి అరెస్ట్‌ వారెంట్‌

26 May, 2017 10:46 IST|Sakshi
బిక్రమ్‌ చౌదరికి అరెస్ట్‌ వారెంట్‌

లాస్‌ఏంజెలిస్‌: ప్రముఖ భారత సంతతి యోగా గురువు బిక్రమ్‌ చౌదరి(69)పై అమెరికాలోని ఓ న్యాయస్థానం అరెస్ట్‌ వారెంట్‌ జారీచేసింది. ఓ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ కేసులో రూ.70 లక్షలు పరిహారాన్ని చెల్లించాలని గతేడాది కోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయకపోవడంతో న్యాయస్థానం అరెస్టుకు ఆదేశించింది. తాను ఆర్థికంగా దెబ్బతినడం వల్ల నష్టపరిహారాన్ని చెల్లించలేనని బ్రికమ్‌ ఇంతకుముందు వెల్లడించారు. మరోవైపు అరెస్టును తప్పించుకునేందుకు బిక్రమ్‌.. ఇప్పటికే అమెరికా నుంచి పరారై ఉండొచ్చని అధికారులు తెలిపారు.

గతేడాది జనవరిలో ఓ యోగా విద్యార్థినిని లైంగికంగా వేధించడంతో పాటు ఇద్దరు ఉద్యోగినుల్ని అకారణంగా తొలగించడంతో బిక్రమ్‌పై కోర్టు విచారణ ప్రారంభించింది. 1970లో అమెరికాలోని బేవర్లీ హిల్స్‌లో తన కార్యాలయాన్ని ప్రారంభించిన బిక్రమ్‌ అనతికాలంలోనే చాలా పేరు ప్రఖ్యాతుల్ని సంపాదించారు. పాప్‌ గాయని మడోన్నా, టెన్నిస్‌ ఆటగాడు ఆండీ ముర్రే వంటి ప్రముఖులు బిక్రమ్‌ శిక్షణా తరగతులకు హాజరయ్యేవారు. 26 ఆసనాలతో వేడిగా ఉండే గదిలో చేసే ‘హాట్‌ యోగా’ను బ్రికమ్‌ సృష్టించారు.

మరిన్ని వార్తలు