అమెరికా కంపెనీ.. ఆమ్యామ్యా కహానీ

18 Jul, 2015 16:33 IST|Sakshi
అమెరికా కంపెనీ.. ఆమ్యామ్యా కహానీ

వాషింగ్టన్: ప్రజలకు మంచినీరు అందించే ప్రాజెక్టుల కాంట్రాక్టును.. అరకొర అర్హతలున్న ఓ 'అంతర్జాతీయ స్థాయి' కంపెనీకి కట్టబెట్టి తద్వారా జాతి సంపదను కొల్లగొట్టిన వైనమింది. చివరికి ఈ వ్యవహారం అమెరికా కోర్టులో బట్టబయలైంది. వివరాల్లోకి వెళితే..

అమెరికాలోని న్యూజెర్సీ కేంద్రంగా పనిచేస్తోన్న లూయీస్ బెర్గర్ అనే నిర్మాణ కంపెనీ మన దేశంలోని గోవా, గువహటిల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వేల కోట్ల వ్యయంతో నిర్మించతలపెట్టిన భారీ తాగునీటి సరఫరా, మురుగు నీటి మళ్లింపు ప్రాజెక్టులను 6 కోట్ల ముడుపులిచ్చి దక్కించుకుంది.

కాగా, లూయీస్ కంపెనీ భారత్లో ఏయే నాయకుడికి ఎంత మొత్తం ముట్టజెప్పింది.. ఏ శాఖ అధికారిని ఎలా ప్రలోభాలకు గురిచేసింది.. పూర్తి వివరాలు తన వద్ద ఉన్నప్పటికీ వాటిని వెల్లడించేందుకు అమెరికా న్యాయ శాఖ నిరాకరించింది. ఒక వేళ ఆ వివరాలు వెలుగులోకి వస్తేగనుక తీవ్ర దుమారం చెలరేగే అవకాశముంది. అసలు ఈ కుంభకోణం వివరాలు ఎలా వెలుగుచూశాయంటే..

లూయీస్ కంపెనీ తన వార్షిక పద్దుల్లో 'కమిట్మెంట్ ఫీజు', 'మార్కెటింగ్ ఫీజు', 'ఆపరేషన్ నిర్వహణా ఖర్చులు' అనే పేర్లతో పెద్ద మొత్తంలో లెక్కల్లో చూపింది. దీంతో అనుమానం వచ్చిన అక్కడి ఆదాయం పన్ను శాఖ అధికారులు మొత్తం వ్యవహారంపై కూపీలాగగా ముడుపుల విషయం బయటపడింది. కంపెనీ ప్రతినిధులైన రిచర్డ్ హిర్ష్, జేమ్స్ మెక్లాంగ్లు విచారణలో నేరం అంగీకరించడంతో కోర్టు వారికి 17.1 మిలియన్ డాలర్ల జరిమానా విధించింది. శిక్షలకు సంబంధించి నవంబర్లో తుది తీర్పు వెలువడనుంది. సదరు లూయీస్ బెర్గర్ కంపెనీకి హైదరాబద్లోనూ ఓ కార్యాలయం ఉండటం గమనార్హం.

మరిన్ని వార్తలు