మోడీపై మళ్లీ విషం గక్కిన అమెరికన్ మీడియా

28 Oct, 2013 09:12 IST|Sakshi

గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీపై అమెరికన్ మీడియా మరోసారి విషం కక్కింది. ఎప్పుడో జరిగిన గుజరాత్ అల్లర్ల గురించి పదే పదే ప్రస్తావిస్తూ, అమెరికన్ పర్యటనకు వీసా కూడా రద్దు చేయించిన అక్కడి మీడియాకు ఇంకా మోడీ మీద కక్ష పోయినట్లు లేదు. తాజాగా పాట్నా ర్యాలీ విజయవంతం అయిన నేపథ్యంలో మళ్లీ తన అక్కసును వెళ్లగక్కింది.

దేశంలోని ప్రజల్లో భయం, విద్వేషాలను రేకెత్తిస్తున్నట్టైతే నరేంద్ర మోడీ భారతదేశాన్ని సమర్థంగా నడిపించగలరని ఆశించలేమని న్యూయార్క్ టైమ్స్ సంపాదకవర్గం అభిప్రాయపడింది. విపక్ష పార్టీలతో కలిసి పనిచేసే లేదా అసమ్మతిని సహించగలిగే ఎలాంటి సామర్థ్యాన్నీ మోడీ ప్రదర్శించలేదంది. ఎన్డీఏ నుంచి జేడీ(యూ) వైదొలగటాన్ని ఆ పత్రిక సంపాదకీయం ప్రస్తావించింది. మోడీ ఆమోదనీయమైన వ్యక్తి కాదని కనుగొన్నందునే పదిహేడేళ్ల మైత్రిని కాదని ఆ పార్టీ బయటకు వచ్చిందని పేర్కొంది.
 
2002 నాటి గుజరాత్ అల్లర్లలో సుమారు 1,000 మంది చనిపోవడాన్ని మరోసారి న్యూయార్క్ టైమ్స్ గుర్తుచేసింది. గుజరాత్‌లో అభివృద్ధి పూర్తి ప్రశంసనీయంగా లేదని పేర్కొంది. దేశంలోని దారిద్ర్య రేటు కన్నా మెరుగైన రేటునే కలిగి ఉన్నా.. గుజరాత్‌లోని ముస్లింలు మిగతా ప్రాంతాల్లో ముస్లింల కంటే వెనుకబడి ఉన్నారని తెలిపింది.

మరిన్ని వార్తలు