సోనియాకు అంత ఆస్తి లేదు: హఫింగ్టన్ పోస్ట్

3 Dec, 2013 14:17 IST|Sakshi
సోనియాకు అంత ఆస్తి లేదు: హఫింగ్టన్ పోస్ట్

ప్రపంచంలో బ్రిటిష్ మహారాణి ఎలిజబెత్ కంటే కూడా సోనియాగాంధీ ధనవంతురాలంటూ పేర్కొన్న అమెరికన్ వెబ్సైట్.. ఆ జాబితాలోంచి సోనియా గాంధీ పేరును తీసేసింది. ఇంత పనికిమాలిన, చెత్త కథనం ఎలా ప్రచురిస్తారంటూ పార్టీ వర్గాలు సదరు న్యూస్ పోర్టల్ మీద మండిపడటంతో వెంటనే సోనియా పేరును తప్పించారు. ఆమెతోపాటు ఖతార్ మాజీ రాజు హమీద్ బిన్ ఖలీఫా అల్ తానీ పేరును కూడా తొలగించినట్లు 'హఫింగ్టన్ పోస్ట్' ఎడిటర్ తమ సైట్లో రాశారు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన నాయకుల పేర్లు ఇవంటూ ఈ న్యూస్ పోర్టల్ ఓ కథనం ప్రచురించింది. సోనియాగాంధీ ఆస్తి 12 వేల కోట్ల రూపాయలని అందులో పేర్కొంది. వేరే సైట్లో ఉన్న కథనం ఆధారంగా సోనియా పేరును అందులో చేర్చామని, వారిని ఇప్పుడు ఈ అంశంపై ప్రశ్నిస్తున్నామని ఎడిటర్ తెలిపారు. అయితే ఆ సైట్ పేరుమాత్రం పేర్కొనలేదు.

సోనియా అసలు ఆస్తి ఎంతన్న విషయాన్ని తమ ఎడిటర్లు పరిశీలించలేకపోవడంతో లింకును తీసేశామని, దీనివల్ల చెలరేగిన గందరగోళానికి క్షమాపణ చెబుతున్నామని నాలుగు రోజుల తర్వాత సదరు ఎడిటర్ చెప్పారు. సోనియాగాంధీ ఆస్తి 12 వేల కోట్ల రూపాయలని చెప్పడానికి ఆధారం ఏంటని కాంగ్రెస్ పార్టీ ఆ సైట్ను ప్రశ్నించింది. ఇలాంటి పనికిమాలిన, చెత్త కథనాలు పెడితే మిమ్మల్ని చూసి నవ్వుకోడానికి తప్ప మీరెందుకూ పనికిరారంటూ కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి మనీష్ తివారీ న్యూఢిల్లీలో అన్నారు.

మరిన్ని వార్తలు