అగ్రరాజ్యాధిపతి ట్రంప్ ప్రసంగం-హెచ్చరికలు?

21 Jan, 2017 09:00 IST|Sakshi
అగ్రరాజ్యాధిపతి ట్రంప్ ప్రసంగం- హెచ్చరికలు?

వాషింగ్టన్: డొనాల్డ్ ట్రంప్  45వ ప్రెసిడెంట్ గా  శుక్రవారం అగ్రరాజ్య పీఠాన్ని అధిష్టించారు. మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ అంటూ  అధికారంలోకి దూసుకువచ్చిన  ట్రంప్ అమెరికా ఫస్ట్‌ అనే నినాదంతోనే తమ ప్రభుత్వం ముందుకెళ్తుందని..దేశానికి పునర్వైభవం తీసుకురావటమే తమ లక్ష్యమని  ప్రకటించి చప్పట్ల మోత మోగించారు. బై అమెరికన్.. హైర్ అమెరికన్ అంటూ ప్రమాణ స్వీకార ఉత్సవానికి హాజరైన సుమారు  8లక్షలమంది జనాన్ని ఉర్రూతలూగించారు.  అంతేకాదు  డొనాల్డ్ ట్రంప్ పదవీ బాధ్యతలు స్వీకరించిన మొదటి ఐదు నిమిషాల్లో మిగిలిన ప్రపంచానికి గట్టి హెచ్చరికలు జారీ చేశారు.    

ప్రధానంగా  ఐసిస్ టెర్రరిజాన్ని ఈ భూమినుంచి తరిమికొడతామని తీవ్రస్వరంతో హెచ్చరించారు.  వివిధ దేశాలతో పాత పొత్తులను బలోపేతం చేస్తూ..కొత్త  ఒప్పందాలతో  నాగరిక   ప్రపంచాన్ని ఐక్యంచేసి రాడికల్ ఇస్లామిక్ టెర్రరిజాన్ని అంతం చేస్తామని తెలిపారు. దీంతోపాటూ గత కొన్నేళ్లుగా ఎంతోమంది అమెరికన్ల ఉద్యోగాలు ఊడిపోయాయని..కలలు చెదిరిపోయాయనీ, ఉద్యోగాలు తిరిగి వెనక్కి రప్పిస్తామంటూ హామీ ఇచ్చి అమెరికా వైపు చూస్తున్న విదేశీయుల గుండెల్లో గుబులు పుట్టించారు. ఇక తమ ప్రతి నిర్ణయం వారి కలలను నిజం చేసే దిశగా ఉంటుందని చెప్పారు. అమెరికన్ల బాధ తమ బాధ అని చెప్పుకొచ్చారు.


ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ చేసిన ప్రసంగం మిగిలిన దేశాలతో పాటుగా..భారత్‌కి కూడా హెచ్చరికగానే మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే  శుక్రవారం నాటి స్టాక్ మార్కెట్లో ఐటి,ఫార్మా రంగాలు తీవ్ర నష్టాల్ని చవిచూశాయి.  అలాగే ఎన్నికల ప్రసంగాల్లో తరచూ వీసాల  నిబంధనలపై పదేపదే  హెచ్చరించడం కూడా ఇందుకు కారణంగా నిపుణుల భావన.  మరోవైపు ప్రమాణ స్వీకార  ప్రసంగంలో ఇకపై ఏ ఉద్యోగమైనా ముందు అమెరికన్ తర్వాతే ఇక ఎవరికైనా అనే సంకేతాలు పంపడం మరింత ఆందోళన రేకెత్తించిందనే చెప్పాలి.   


తమ విజయం ప్రజల విజయంగా చరిత్రలో మిగిలిపోనుందని పేర్కొన్న ట్రంప్  ఇండస్ట్రీలు, టెక్నాలజీ, కంపెనీలు..ఇలా ఏ ఒక్కటి కూడా ఇకపై ఇతరదేశాలకి తరలిపోవడానికి వీల్లేదని హెచ్చరించారు. బ్లాక్ అయినా, వైట్ అయినా,  బ్రౌన్ అయినా  ఎలాంటి   తారతమ్యం లేకుండా  ఏ ఒక్క అమెరికన్ ఇకపై నిర్లక్ష్యానికి గురికారని  ట్రంప్ హామీ ఇవ్వడం విశేషం.  అటు ప్రముఖ పెట్టుబడుదారుడు  జార్జ్ సోరింగ్  కూడా మార్కెట్లలో ఆర్థికమాంద్యం పరిస్థితులు రానున్నాయనీ, మార్కెట్లలో తీవ్ర అనిశ్చితి పరిస్తితులు కొనసాగనున్నాయని హెచ్చరించడం గమనార్హం.  ట్రంప్ ఎఫెక్ట్ ..సోమవారం నాటి దేశీయ మార్కెట్‌పై ఏ మేరకు పడనుంది? భవిష్యత్తులో  అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్  తీసుకునే  నిర్ణయాలు, విధానాల ప్రభావం గ్లోబల్ మార్కెట్లపై  ఏ మేరకు పడనుందో  వేచి చూడాల్సిందే.