ఎగవేతదారులను వదలొద్దు

11 Feb, 2014 01:08 IST|Sakshi
ఎగవేతదారులను వదలొద్దు

 న్యూఢిల్లీ: కావాలని రుణాలు ఎగ్గొట్టేవారిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదలొద్దని... బకాయిల వసూళ్లకు కఠిన చర్యలు చేపట్టాల్సిందిగా బ్యాంకులకు ఆర్థిక మంత్రి చిదంబరం స్పష్టం చేశారు. సోమవారం ఇక్కడ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 78వ వ్యవస్థాపకదినోత్సవం సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

 మరోపక్క, ఆర్థిక మందగమనం కారణంగా రుణాలను చెల్లించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారికి మాత్రం చేయూతనందించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల ఎన్‌పీఏల మొత్తం గతేడాది సెప్టెంబర్ నాటికి రూ.2.36 లక్షల కోట్లకు ఎగబాకాయి. క్రితం ఏడాది మార్చిలో రూ.1.83 లక్షల కోట్లతో పోలిస్తే 28.5% దూసుకెళ్లడం గమనార్హం. 2011 మార్చి నాటికి ఈ మొత్తం రూ.94,121 కోట్లు కాగా, 2012 మార్చికల్లా రూ.1.37 లక్షల కోట్లకు చేరింది.

 మూలధనంపై...
 భవిష్యత్తులో బ్యాంకులకు అత్యంత భారీస్థాయిలో మూలధనం అవసరమవుతుందని.. ప్రభుత్వం తనవంతు చేయూత అందిస్తోందని చిదంబరం చెప్పారు. బ్యాంకులు కూడా తమ లాభాల నుంచి(పన్నులు, డివిడెండ్‌లను చెల్లించాక) మూలధన పెట్టుబడుల కోసం వ్యయాన్ని పక్కనబెట్టాల్సిందేననని చెప్పారు. పీఎస్‌యూ బ్యాంకులు 2011-12లో ఈ విధంగా రూ.35,000 కోట్లు, 2012-13లో రూ.37,936 కోట్లను వెచ్చించినట్లు ఆయన వెల్లడించారు. అదనపు మూలధనం కోసం లాభాల్లో ఎంత మొత్తాన్ని వినియోగించాలన్నది బ్యాంకులు ఇంకా ఒక నిర్ణయానికి రాలేదన్నారు.

 పీఎస్‌యూ బ్యాంకులకు కేంద్రం 2011-12లో రూ.12,000 కోట్లు, 2012-13లో రూ.12,517 కోట్లు చొప్పున మూలధనాన్ని సమకూర్చగా... ఈ ఏడాది(2013-14) రూ.14,000 కోట్లను కేటాయించడం తెలిసిందే.

మరిన్ని వార్తలు