హోం గార్డులను చితకబాదిన యూపీ పోలీసులు

21 Oct, 2013 15:44 IST|Sakshi
హోం గార్డులను చితకబాదిన యూపీ పోలీసులు

మనోడైనా.. పక్కనవాడైనా ఒకటే న్యాయం అన్నట్లు ప్రవర్తిస్తున్నారు ఉత్తరప్రదేశ్ పోలీసులు. జీతాలు పెంచాల్సిందిగా ఎప్పటినుంచో కోరుతున్న అక్కడి హోంగార్డులు.. తమ న్యాయమైన డిమాండును నెరవేర్చాలని కోరుతూ సోమవారం నాడు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ వద్ద నిరసన ప్రదర్శనకు దిగారు. వారిని అక్కడినుంచి వెళ్లిపోవాలని పోలీసులు హెచ్చరించారు. కానీ, తమకు ఏదో ఒక స్పష్టమైన హామీ వస్తే తప్ప కదిలేదని లేదని హోం గార్డులు వాదించగా, పోలీసులు వెంటనే తమ లాఠీలకు పని చెప్పారు.

ప్రతిరోజూ విధి నిర్వహణలో తమతో పాటు చేదోడు వాదోడుగా ఉంటూ నామమాత్రపు జీతాలకే పనిచేస్తున్న హోం గార్డుల పట్ల కనీస కనికరం కూడా లేకుండా ఇష్టం వచ్చినట్లు లాఠీలతో బాదారు. అప్పటికీ వాళ్లు అక్కడి నుంచి కదలకపోవడంతో బాష్పవాయువు కూడా ప్రయోగించారు.

సోమవారం పోలీసు అమరవీరుల దినోత్సవం. పోలీసులు చేసిన త్యాగాలను గుర్తుచేసుకుంటూ ప్రతి ఒక్కరూ వారి సేవలను శ్లాఘించిన రోజు. సరిగ్గా ఇదే రోజు పోలీసులు తమకు తమ్ముళ్ల లాంటి హోం గార్డుల మీద విచక్షణా రహితంగా లాఠీచార్జీ చేయడం పలు విమర్శలకు తావిచ్చింది.

మరిన్ని వార్తలు