యోగి ఎఫెక్ట్: దుకాణాల్లో ఏమైందంటే..

25 Mar, 2017 17:23 IST|Sakshi
యోగి ఎఫెక్ట్: దుకాణాల్లో ఏమైందంటే..

ప్రభుత్వ కార్యాలయాల్లో ఎక్కడా పాన్ మసాలా, గుట్కా మరకలు కనిపించడానికి వీల్లేదు... సీఎం యోగి ఆర్డర్
అక్రమ కబేళాలను వెంటనే మూసేయాలి. అవి నడవడానికి వీల్లేదు.. ముఖ్యమంత్రి ఆదేశం
గ్యాంగ్ రేప్ చేసి, యాసిడ్ తాగించిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలి.. ఆస్పత్రిలో పోలీసులతో ఆదిత్యనాథ్


వరుసపెట్టి పలు అంశాల్లో తన మార్కు చూపిస్తున్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎఫెక్ట్ రాష్ట్రం మీద బాగానే కనపడుతోంది. ముఖ్యమంత్రి స్వయంగా ఆస్పత్రికి వచ్చి గ్యాంగ్ రేప్ బాధితురాలిని పరామర్శించిన తర్వాత.. రెండు గంటల్లోనే ఆ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఒక్కటే కాదు.. ఇంకా చాలా విషయాల్లో యోగి మార్క్ కనిపిస్తోంది. ప్రధానంగా దుకాణదారులు తమ దుకాణాల వద్ద బోర్డులు పెట్టి మరీ.. కస్టమర్లను తప్పనిసరిగా డస్ట్‌బిన్‌లు ఉపయోగించమని కోరుతున్నారు. తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచే ప్రయత్నాలు చేస్తున్నారు. లక్నో మహాత్మాగాంధీ మార్గ్ ప్రాంతంలోని కొంతమంది దుకాణదారులు పరిశుభ్రత కోసం స్వయంగా కృషి చేయడమే కాక.. కస్టమర్లకు కూడా చేతులు జోడించి మరీ చెబుతున్నారు. జితేందర్ కుమార్ యాదవ్ అనే వర్తకుడు లక్నోలో ఓ ధాబా నిర్వహిస్తారు. ఇటీవలి కాలంలో తన వ్యాపారం ఒక్కసారిగా బాగా పుంజుకుందని, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను కలవడానికి వచ్చిన జనాలు తమ ధాబాకు వచ్చి తింటున్నారని చెప్పారు. ఆయన తన ధాబా వద్ద డస్ట్‌బిన్‌లు పెట్టడమే కాక, నోటీసులు కూడా అతికించారు. అంతకుముందు వరకు కస్టమర్లు వదిలేసిన ఆహార పదార్థాల చుట్టూ ఈగలు ముసిరేవని, కానీ ఇప్పుడు డస్ట్‌బిన్‌లు పెట్టిన తర్వాత అవి లేవని అన్నారు. అంతేకాదు, తన ధాబా పక్కనున్న ఫుట్‌పాత్ మొత్తాన్ని తన వర్కర్లతో శుభ్రం చేయిస్తున్నారు. సామాన్యులు కూడా తలుచుకుంటేనే స్వచ్ఛభారతం సాధ్యం అవుతుందని జితేందర్ అన్నారు. తనతో పాటు చాలామంది వర్తకులు ఇప్పుడు డస్ట్‌బిన్‌లు పెట్టారని, తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుతున్నారని చెప్పారు.

జితేందర్ దుకాణం పక్కనే ఉమాశంకర్ యాదవ్‌కు చెందిన టీకొట్టు ఉంది. అక్కడ మట్టి పాత్రలో ఇచ్చే టీ తాగడం జనానికి ఇష్టం. తాగిన తర్వాత ఇంతకుముందు ఆ పాత్రలను రోడ్డుమీదే పారేసేవారు. కానీ ఇప్పుడు డస్ట్‌బిన్‌లు పెట్టడంతో వాటిలో వేస్తున్నారు. పలు ప్రభుత్వ శాఖలు పరిశుభ్రత కార్యక్రమానికి పెద్దపీట వేస్తూ, సీఎం యోగి చేపట్టిన మిషన్‌ను విజయవంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. లక్నో సీనియర్ ఎస్పీ స్వయంగా పోలీసు స్టేషన్‌ను శుభ్రం చేసి ఉదాహరణగా నిలిచారు. విద్యుత్ శాఖ మంత్రి శ్రీకాంత్ శర్మ కూడా తన కార్యాలయాన్ని తానే శుభ్రం చేసుకున్నారు. ఇలా క్రమంగా ఈ కార్యక్రమానికి మంచి ఊతం లభిస్తోంది.

మరిన్ని వార్తలు