నితీశ్‌ను చూసైనా నేర్చుకోండి

29 Aug, 2015 02:44 IST|Sakshi
నితీశ్‌ను చూసైనా నేర్చుకోండి

సీఎంకు వాసిరెడ్డి పద్మ సూచన
సాక్షి, హైదరాబాద్: బీహార్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీవల్ల ఏమీ ప్రయోజనం లేదంటూ తమకు ప్రత్యేక హోదానే కావాలంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ డిమాండ్ చేస్తుంటే మన రాష్ట్రంలో చంద్రబాబు మాత్రం ప్రత్యేకహోదా వద్దు, ప్యాకేజీ ఇచ్చినా చాలంటూ ప్రాధేయపడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తింది. నితీష్‌ను చూసైనా చంద్రబాబు బుద్ధి తెచ్చుకోవాలని సూచించింది.

పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ శుక్రవారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. కేంద్రం సాధారణంగా రాష్ట్రాల్లో అమలు చేసే పథకాల ఖర్చు చేసే మొత్తాలు కాకుండా బీహార్‌కు ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజీలో అదనంగా చూపించింది కేవలం రూ.5000 కోట్లకు మించి లేదని గణాంకాలతో నితీష్‌కుమార్ వివరించారని గుర్తుచేశారు.

అయినా చంద్రబాబు మాత్రం విభజన తరువాత రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన ప్రత్యేక హోదాను కాదని, కేంద్రం ప్యాకేజీతో సరిపెట్టాలని చూస్తుంటే సరేనంటున్నారని దుయ్యబట్టారు. కేంద్రం ఏదో ఇస్తున్నట్టు, ఈయనేదో మోసుకొస్తున్నట్టు ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. ప్పటి ప్రధాని ఇచ్చిన హామీతో రాష్ట్రం రెండు ముక్కలయినా ఏపీకి హోదావల్ల న్యాయం జరుగుతుందని నమ్మకం పెట్టుకున్న ప్రజలు గుండెలు ఇప్పుడు ఆగిపోతున్నాయన్నారు.
 
హోదా లేని రాష్ట్రాలకు రాయితీలు ఇచ్చిన దాఖలాలు లేవు
ప్రత్యేక హోదా కల్పించబడిన రాష్ట్రాలకు తప్ప దేశంలో ఇతర రాష్ట్రాలకు పారిశ్రామిక రాయితీల పేరుతో ప్యాకేజీ ఇచ్చిన దాఖలాలు లేవని పద్మ తెలిపారు. ఇప్పటివరకు హోదా దక్కిన 11 రాష్ట్రాలకు మాత్రమే కేంద్రం రాయితీలు కల్పించిందన్నారు. వైఎస్సార్ సీపీ ప్రత్యేక హోదా డిమాండ్‌తో శనివారం నిర్వహించిన తలపెట్టిన బంద్‌ను జయప్రదం చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని.. చంద్రబాబు తన వంతుగా బంద్‌ను విజయవంతం చేసి, ప్రజల ఆలోచనలను కేంద్రానికి వివరించడం ద్వారా మన రాష్ట్ర హక్కును సాధించాలని పద్మ సూచించారు.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా