కమలంపై అవినీతి మరకలు

26 Jun, 2015 02:41 IST|Sakshi
కమలంపై అవినీతి మరకలు

బీజేపీని, మోదీ సర్కారును ఇరుకునపెడ్తున్న మహిళా నేతల అవినీతి: సమర్ధించుకోలేని స్థాయిలో అక్రమాలకు ఆధారాలు
బీజేపీలోని నలుగురు కీలక మహిళానేతలు.. వారిలో ఇద్దరు కేంద్ర మంత్రులు.. ఒకరు ముఖ్యమంత్రి, మరొకరు రాష్ట్ర మంత్రి.. అవినీతి మరకల్తో ఆ పార్టీకి, కేంద్ర ప్రభుత్వానికి యథాశక్తి తలవంపులుతెచ్చారు.
సమర్ధించడానికి కూడా వీలుకాని తీరులో వారి అవినీతి, అక్రమాలు వెలుగులోకి రావడంతో బీజేపీ అగ్రనాయకత్వం నీళ్లు నమిలే పరిస్థితి నెలకొంది.


అవినీతి మరకే లేదంటూ ఏడాది పాలన ఉత్సవాలను ఘనంగా జరుపుకుని నెల రోజులైనా గడవకముందే.. తమ మహిళా మంత్రుల నిర్వాకాలు మోదీ సర్కారును తలెత్తుకోలేని స్థాయికి దిగజార్చాయి. విపక్ష అస్త్రాలకు సమాధానమిచ్చేందుకు పార్టీ, ప్రభుత్వంలోని మహామహులైన మాటల మాంత్రికులకే మాటలు దొరకడం లేదు.    - సెంట్రల్ డెస్క్

 
సుష్మా స్వరాజ్
కేంద్ర విదేశాంగ మంత్రి. పార్టీలో, ప్రభుత్వంలో సమర్ధవంతురాలైన కీలక నేత. ఐపీఎల్ స్కామ్‌స్టర్,  లలిత్ మోదీకి.. బ్రిటన్ నుంచి పోర్చుగల్ వెళ్లేందుకు బ్రిటన్ ప్రభుత్వం నుంచి ట్రావెల్ డాక్యుమెంట్స్ లభించేందుకు సహకరించారు. ఆ విషయాన్ని అంగీకరించిన సుష్మా.. లలిత్ భార్య కేన్సర్ చికిత్స కోసం మానవతా దృక్పథంతోనే మాట సాయం చేశానని సమర్ధించుకున్నారు. కానీ తీవ్రమైన కేసుల్లో నిందితుడిగా ఉండి,  పరారీలో ఉన్న నిందితుడికి సాయం చేయడం ఏ రకంగానూ సమర్ధనీయం కాదని, సుష్మా రాజీనామా చేయాల్సిందేనని విపక్షాలు పట్టుపడుతున్నాయి. సుష్మా భర్త, కూతురు తనకు న్యాయ సేవలందించారని లలిత్ వెల్లడించడం సుష్మాను ఇబ్బందుల్లోకి నెట్టింది.
 
వసుంధర రాజే
బీజేపీ సీనియర్ నేత. రాజస్తాన్ ముఖ్యమంత్రి. లలిత్ మోదీ వ్యవహారంలో రెండో వికెట్. లలిత్ మోదీ బ్రిటన్ వెళ్లేందుకు వీలుగా ఇమిగ్రేషన్ పత్రాలపై సాక్షి సంతకం చేసి ఇరుక్కున్నారు. మొదట, సంబంధిత డాక్యుమెంట్ గురించి తెలియదని, ఆ తరువాత, గుర్తు లేదని సమర్ధించుకున్నారు. తాజాగా, ఆమె సంతకం చేసిన పత్రాలను కాంగ్రెస్ బయటపెట్టడంతో.. సంతకం చేసింది తానేనని, లలిత్‌ని కుటుంబ స్నేహితుడిగా భావించి, ఆ సాయం చేశానని బీజేపీ అగ్ర నాయకత్వానికి రాజే వివరణ ఇచ్చారని సమాచారం. రాజే కుమారుడు, బీజేపీ ఎంపీ దుష్యంత్ సింగ్ కంపెనీలో లలిత్ పెట్టుబడులు పెట్టిన విషయ మూ వెలుగులోకి రావడం ఆమెను మరింత ఇబ్బందుల్లోకి నెట్టింది.
 
స్మృతి ఇరానీ
కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి. బీజేపీ కీలక నేత. ఇరానీ విద్యార్హతల అంశం మొదట్నుంచీ వివాదాస్పదమే. తాజాగా ఆమె తన విద్యార్హతలను వివిధ ఎన్నికల సందర్భాల్లో వేర్వేరుగా ఎన్నికల సంఘానికి అఫిడవిట్ల రూపంలో వెల్లడించారని ఆరోపిస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. 2004 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బీఏ(కరస్పాండెన్స్), 2011 రాజ్యసభ ఎన్నికల సమయంలో అదే వర్సిటీ నుంచి బీకాం(కరస్పాండెన్స్), 2014 లోక్‌సభ ఎన్నికలప్పుడు బీకాం (సార్వత్రిక విద్య) చేశానని ఈసీకి సమర్పించిన అఫిడవిట్లలో వేర్వేరుగా పేర్కొన్నారని ఆ పిటిషన్లో ఆరోపించారు. ఆ పిటిషన్‌కు విచారణార్హత ఉందని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేయడంతో ఇరానీ చిక్కుల్లో పడ్డారు.
 
పంకజ ముండే
బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి దివంగత గోపీనాథ్ ముండే కూతురు. మహారాష్ట్ర ప్రభుత్వంలో స్త్రీ, శిశు అభివృద్ధి శాఖ మంత్రి. తాజాగా, ఆమె రూ. 206 కోట్ల అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. చిన్నారులకు అందించే ఆహార పదార్ధాలను నిబంధనలకు విరుద్ధంగా కొనుగోలు చేశారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఒక్కరోజులోనే దాదాపు రూ. 115 కోట్ల విలువైన పల్లీ పట్టీ(వేరుశనగ గింజలు, బెల్లంతో చేసే బలవర్ధక ఆహారం) కొనుగోలుకు ఆదేశాలిచ్చారన్నది ఆమెపై వచ్చిన ప్రధాన ఆరోపణ. ఆ పల్లీపట్టీ నాసిరకంగా ఉండటంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఈ కుంభకోణంలో భారీ మొత్తంలోనే చేతులు మారాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

మరిన్ని వార్తలు