వ్యాట్ చెల్లించాల్సిందే..!

13 Oct, 2015 02:06 IST|Sakshi
వ్యాట్ చెల్లించాల్సిందే..!

సాక్షి, ముంబై: భక్తుల పాలిట కొంగుబంగారం ‘లాల్‌బాగ్ చా రాజా’.. ప్రభుత్వానికి ఒక శాతం విలువ ఆధారిత పన్ను (వ్యాట్) చెల్లించాల్సిందేనని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. భక్తులు సమర్పించుకున్న కానుకలకు వ్యాట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ ‘లాల్‌బాగ్ చా రాజా సార్వజనిక గణేశ్ ఉత్సవ మండలి’ దాఖలు పిటిషన్‌ను బాంబే హైకోర్టు తిరస్కరించింది. కానుకల వేలం, హుండీ నగదు రూపంలో వచ్చే డబ్బును ఏడాది కాలంలో పేదలకు ఆర్థిక సాయం, ఉచిత వైద్య శిబిరాలు, దారిద్య్రరేఖకు దిగువనున్న వారికి వైద్యానికి అయ్యే ఖర్చులు, కరువు పీడిత ప్రాంత ప్రజలకు చేయూత వంటి సామాజిక, సహాయక కార్యక్రమాలు చేపడతామని, ఇందుకోసం తమకు వ్యాట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని ఉత్సవ మండలి దాఖలు చేసిన పిటిషన్ విచారణను కోర్టు చేపట్టింది.

విచారణ అనంతరం జస్టిస్ ఎస్.సీ.ధర్మాధికారి నేతృత్వంలోని బెంచి పిటిషన్‌ను తిరస్కరించింది. ‘భక్తులు సమర్పించుకున్న కానుకలు అసలు ధరకు విక్రయించడం లేదు. వాటిని వేలంలో విక్రయించడం వల్ల మండలికి అదనపు ఆదాయం వస్తుంది. ఇది ఒక వ్యాపారం లాంటిదే’ అని బెంచి అభిప్రాయపడింది. వ్యాట్ చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది.
 
వ్యాపారుల ఇక్కట్లు
‘లాల్‌బాగ్ చా రాజా’ వల్ల స్థానిక వ్యాపారులు నష్టాలు చవిచూస్తున్నారు. గణేశ్ ఉత్సవాలు ప్రారంభానికి రెండు రోజుల ముందు నుంచి ముగిసేవరకు దాదాపు పక్షం రోజులపాటు బేరాలు లేక వారి వ్యాపారం పూర్తిగా దెబ్బతింటుంది. ఈ నేపథ్యంలో వారు కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. లాల్‌బాగ్ చా రాజా ను దర్శించుకునేందుకు సినీ, రాజకీయ, పారిశ్రామిక రంగాల ప్రముఖులు వస్తుంటారు.

దీంతో వారి భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ ఈ ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుంటారు. రోడ్లపై దారి పొడవునా బారికేడ్లు, భారీ పోలీసు బలగాలు, వ్యాన్లు వంటి వాటి వల్ల కొనుగోలుదారులు షాపుల దరిదాపులకు కూడా రావడం లేదని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకపోతే హైకోర్టును ఆశ్రయిస్తామని లాల్‌బాగ్ ప్రాంత వ్యాపారుల సంఘటన అధ్యక్షుడు సూర్యకాంత్ పాంచాల్ హెచ్చరించారు.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా