అదనపు బాధ్యతలు స్వీకరించిన వీరప్ప మొయిలీ

24 Dec, 2013 13:58 IST|Sakshi
అదనపు బాధ్యతలు స్వీకరించిన వీరప్ప మొయిలీ

దేశంలో పచ్చదనం పరిరక్షించేందుకు రాజీ లేని పోరాటం చేస్తానని కేంద్ర చమురు శాఖ మంత్రి వీరప్ప మొయిలీ స్పష్టం చేశారు. పర్యావరణం, అడవులు అనేవి మనిషి జీవితంలో ఓ భాగమని ఆయన పేర్కొన్నారు. అవి వాతావరణ పరిరక్షణలో కీలక భూమిక పోషిస్తాయని తెలిపారు. అడవులు, పర్యావరణ మంత్రిగా అదనపు బాధ్యతలు మంగళవారం వీరప్ప మొయిలీ స్వీకరించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. అడవులు, పర్యావరణ శాఖ మంత్రి జయంతి నటరాజన్ శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు.

 

ఈ నేపథ్యంలో ఆ శాఖ బాధ్యతలను చమురు శాఖ మంత్రి వీరప్ప మొయిలీకి అప్పగిస్తున్నట్లు రాష్ట్రపతి భవనం వెనువెంటనే విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది. దాంతో వీరప్ప మొయిలీ మంగళవారం అదనపు బాధ్యతలు స్వీకరించారు. కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు కృషి చేసేందుకే మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు జయంతి వెల్లడించారు. అయితే పర్యావరణ ప్రాజెక్టు అనుమతుల్లో తీవ్ర జాప్యం చేస్తున్న కారణంగా జయంతిని పదవి నుంచి తొలగించినట్లు ఊహాగానాలు వెల్లువెత్తాయి.

మరిన్ని వార్తలు