మండుతున్న ‘కూరగాయా’లు!

16 Nov, 2013 09:00 IST|Sakshi
మండుతున్న ‘కూరగాయా’లు!

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. రాకెట్ వేగంతో పెరిగిన కూరల ధరలు ప్రజలకు గుండె దడ తెప్పిస్తున్నాయి. రాజధాని నగరంలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూరగాయలు, ఆకుకూరల ధరలు చుక్కలనంటుతున్నాయి. సరిగ్గా వారం రోజుల కిందట హైదరాబాద్ మార్కెట్‌లో కిలో రూ.23 ఉన్న టమాటా శుక్రవారం నాటికి రూ.50కి ఎగబాకింది. నెల రోజుల క్రితం కిలో రూ.20 ఉన్న కిలో గోరుచిక్కుడు ఇప్పుడు రూ.60కి చేరింది. మొన్నటి వరకూ రూ.3 ఉన్న ములక్కాడ నేడు రూ. 12కి పెరిగింది. కిలో రూ. 40 లేనిదే హైదరాబాద్ మార్కెట్లలో ఏ కూరగాయలూ దొరకడంలేదు. కిలో దొండ ధర అనూహ్యంగా రూ. 55కి పెరిగింది.
 
 చాలా కాలనీల్లో దుకాణాలవారు దొండ, బీన్స్ కిలో రూ.60కి కూడా అమ్ముతున్నారు. రైతు బజార్లలో కూడా బీన్స్ కిలో రూ.50కి విక్రయిస్తున్నారు. నెల రోజుల కిందటితో పోల్చితే వివిధ రకాల కూరగాయలు, ఆకు కూరల ధరలు రెట్టింపయ్యాయి. నెల కిందట తోటకూర పెద్ద కట్ట రూ.5కు ఇచ్చేవారు. ఇప్పుడు అదే కట్ట రూ.12 నుంచి 15కు పెంచేశారు.
 
 వర్షాల వల్ల కూరగాయలు, ఆకుకూరల తోటలు దెబ్బతిన్నాయని,  సరఫరా తగ్గిపోయి ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు.  వర్షాల వల్ల కూరగాయలు, ఆకుకూరల తోటలు కొంతమేరకు దెబ్బతిన్న విషయం వాస్తవమైనా.. దీని వల్లే ధరలు పెరిగాయనే వాదనలో వాస్తవం లేదు. ధరల పెరుగుదలకు వర్షాలే కారణమైతే కర్ణాటక, మహారాష్ట్రల నుంచి వచ్చే బీన్స్, క్యారట్, క్యాప్సికం ధరలు ఎందుకు పెరిగినట్లు? బీన్స్, క్యాప్సికం కిలో రూ. 60, క్యారట్ కిలో రూ.50 పలుకుతున్నాయి. దీన్నిబట్టి మధ్య దళారులు, వ్యాపారులు వర్షాలను సాకుగా చూపి ఇష్టారాజ్యంగా ధరలు పెంచేశారని స్పష్టమవుతోంది.
 
 సామాన్యుల బాధలు పట్టని ప్రభుత్వం
 గతంలో కూరగాయల ధరలు పెరిగిన సమయాల్లో ప్రభుత్వం కలుగజేసుకుని రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటుచేసి కొంతవరకూ సరసమైన ధరలకు కూరగాయలు విక్రయించేది. ధరల నియంత్రణకు రూ.500 కోట్లతో మార్కెట్ ఇంటర్‌వెన్షన్ ఫండ్ ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వ ప్రకటన నీటిమూటలా మారింది.  ‘గతంలో రూ.200 తీసుకెళితే వారానికి సరిపడా కూరగాయలు వచ్చేవి. ఇప్పుడు రూ.500 తీసుకెళ్లినా సంచి నిండా రావడం లేదు. కూరగాయలు కొనాలంటే చికెన్ కొన్నట్లుంది. కిలో రూ.60 రూపాయలు పెట్టి బీన్స్, గోరుచిక్కుడు, దొండ ఏమి తింటాం. అందుకే వీటిని కొనడమే మానేశాం. గతంలో వారానికి రెండు కిలోల టమాటాలు కొనే మేం ఇప్పుడు కిలోతోనే సరిపెట్టుకుంటున్నాం..’ అని హైదరాబాద్‌లోని ఆదర్శనగర్‌కు చెందిన ఇందుమతి అనే గృహిణి ఆవేదన వ్యక్తం చేశారు. ‘గతంలో కిలో చొప్పున కూరగాయలు తీసుకునే వాళ్లం. ఇప్పుడు అన్నీ అరకిలో చొప్పునే తీసుకుని సరిపెట్టుకుంటున్నాం. నేడు కూరగాయలు కొనడమంటే కందిపప్పు, మినప్పప్పు కొన్నట్లుంది..’  రాజధాని నగరంలోని శాంతినగర్‌కు చెందిన ప్రయివేటు బ్యాంకు ఉద్యోగిని నాగమణి అన్నారు.
 
 బోర్డులకే పరిమితమైన రైతు బజారు ధరలు

 కొద్దిగానైనా తక్కువ ధరతో లభిస్తాయని కూరగాయల కోసం రైతు బజారుకు వెళ్లిన వారికి నిరాశ తప్పడంలేదు. అక్కడ బోర్డులపై రాసిన ధరలకూ అమ్ముతున్న ధరలకూ పొంతనేలేదు. బోర్డుపై రాసిన ధరల కంటే కిలో రూ. 10 నుంచి 16 రూపాయలు అధిక ధరకు రైతు బజారులోని వ్యాపారులు కూరగాయలు విక్రయిస్తున్నారు. బోర్డులో కిలో బీన్స్ ధర రూ.32 ఉండగా వ్యాపారులు రూ.50కి తక్కువ అమ్మడం లేదు. క్యారట్ ధర రూ.22 కాగా వ్యాపారులు రూ.40కి విక్రయించారు.

 

క్యాబేజి ధర రూ.12 కాగా వ్యాపారులు మాత్రం రూ.30కి అమ్ముతున్నారు. బోర్డులోని ధర ప్రకారం ఎందుకు అమ్మరని ఎవరైనా ప్రశ్నిస్తే ‘మేం అమ్మేది ఇంతే నచ్చితే కొనండి.. లేదంటే వెళ్లండి’ అని వ్యాపారులు అంటుండడంతో ప్రజలకు దిక్కు తోచడం లేదు. ఫిర్యాదు చేసినా ఏమీ చేయలేని పరిస్థితిలో రైతు బజారు అధికారులు ఉన్నారు.
 
 కిలో కూరగాయలు.. అర కిలో చికెన్!
 అసలే చలికాలం.. ఆపై కార్తీకమాసం.. చికెన్ ధరలు తగ్గాయి.. స్కిన్‌లెస్ చికెన్ కిలో రూ.90కే లభిస్తోంది. ప్రస్తుత కూరగాయల ధరలను పరిశీలిస్తే కిలో కూరగాయలు కొని వండుకుని తినడం కన్నా.. ఇద్దరు, ముగ్గురు సభ్యులున్న ఓ కుటుంబం హాయిగా అర్ధకిలో చికెన్ తెచ్చుకుని మసాలా దట్టించి లాగిస్తే బాగుండనే భావన వ్యక్తమవుతోంది.

మరిన్ని వార్తలు