చెన్నైలో జగన్నినాదం

5 Dec, 2013 05:32 IST|Sakshi

సాక్షి, చెన్నై: వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెన్నైలో అభిమానులు నీరాజనం పట్టారు. జగన్ రాక సందర్భంగా నగర వీధులు వైఎస్సార్ సీపీ జెండాలతో రెపరెపలాడాయి. ఎటు చూసినా ఆహ్వాన ఫ్లెక్సీలు హోరెత్తాయి. బుధవారం హైదరాబాద్ నుంచి చెన్నైకు చేరుకున్న జన నేతను చూడటానికి చెన్నై శివారుల్లోని జనం వేలాదిగా తరలి రావటంతో మీనంబాక్కం విమానాశ్రయం జన సాగరమైంది. వైఎస్సార్ సీపీ తమిళనాడు విభాగం నాయకులు జాకీర్, శరవణన్, శరత్కుమార్ ఎదురు వెళ్లి స్వాగతం పలికారు. డప్పుల హోరు, మేళతాళాలు, కేరళ వాయిద్యాల నడుమ జగన్ను తమ నగరంలోకి సాదరంగా ఆహ్వానించారు. అభిమాన సందోహంతో ఏడు కిలో మీటర్ల దూరం ప్రయాణించడానికి జగన్కు రెండు గంటల సమయం పట్టింది. నగరంలోని నందనం సిగ్నల్ దాటగానే, అభిమానుల కోసం 25 నిమిషాలకు పైగా ఆయన కాన్వాయ్ ఆగింది.
 
  ఇక ఆళ్వార్ పేటలోని సోదరుడు వైఎస్ అనిల్ రెడ్డి ఇంటికి వెళ్లే మార్గం అంతా పండుగ సందడి నెలకొంది. ఈ సందర్భంగా నెల్లూరుకు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జగన్ సమక్షంలో వైఎస్ఆర్ సీపీలో చేరారు. మధ్యాహ్నం 2 గంటలకు తమిళనాడు సచివాలయూనికి చేరుకున్న జగన్ 2.30 వరకు సీఎం జయలలితతో చర్చలు జరిపారు. సాయంత్రం 5.15కు కరుణానిధి ఇంటికి చేరుకోగానే కరుణ తనయుడు స్టాలిన్, కుమార్తె, ఎంపీ కనిమొళి జగన్కు ఎదురేగి దుశ్శాలువలు కప్పి ఇంటిలోకి తీసుకెళ్లారు. జగన్ వెంట ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి, పార్టీ నాయకులు మైసూరా రెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, దాడి వీరభద్రరావు, వైఎస్ అనిల్రెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఉన్నారు.

మరిన్ని వార్తలు