ప్రకృతితో ముడిపడేదే జీవనం

18 Jan, 2016 02:06 IST|Sakshi
ప్రకృతితో ముడిపడేదే జీవనం

పర్యావరణ పరిరక్షణకు ఇదే అవసరమన్న ప్రధాని
* వెంకయ్య నివాసంలో సంక్రాంతి సంబరాలకు హాజరు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రకృతితో ముడిపడిన జీవనశైలిని అలవర్చుకుని ముందుకెళ్లాలని, దీనివల్లే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రపంచానికి పెద్ద సవాల్‌గా నిలిచిన పర్యావరణ ముప్పును అధిగమించేందుకు ప్రజలంతా పరిస్థితిని బట్టి ప్రకృతితో ఒదిగిపోవాలన్నారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు నివాసంలో ఆదివారం నిర్వహించిన సంక్రాంతి సంబరాలకు హాజరైన ప్రధాని.. గతనెలలో జరిగిన పారిస్ పర్యావరణ సదస్సులోనూ ప్రకృతితో మమేకమవటంపై తీవ్ర చర్చ జరిగిందన్నారు.  

ఇన్నాళ్లూ జరిగిన ప్రకృతి విధ్వంసానికి పాల్పడిన దేశాలు ఇప్పుడిప్పుడే ప్రకృతి గురించి ఆలోచిస్తున్నాయని తెలిపారు. సూర్యచంద్రుల గమనం ఆధారంగానే మానవజీవనం సాగుతోందని చెప్పారు. శతాబ్దాల కిందట ఆదివారం సెలవు దినం కాదని, అమావాస్య, పౌర్ణమి రోజుల్లోనే సెలవులుండేవని గుర్తుచేశారు. మన దేశంలో పండుగలకు చాలా విశిష్టత ఉందని, రైతుల పంట కోతకు వచ్చినప్పుడు, నాట్లు వేసినప్పుడు పండుగలు జరుపుకుంటారని, మన పండుగలు ఆర్థిక గమనంలోనూ కలిసిపోయాయన్నారు.

సంక్రాంతి నుంచి పగలు ఎక్కువగా ఉంటుందని, సూర్య తేజస్సులా ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాలని అన్నారు. దక్షిణాది రాష్ట్రాల వారి కోసం ప్రతి ఏటా సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తుంటామని వెంకయ్య చెప్పారు. లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ సంబరాలను ప్రారంభించారు. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, హర్షవర్ధన్, వీకే సింగ్, ముక్తార్ అబ్బాస్ నక్వీ, నజ్మా హెప్తుల్లా, మహేశ్ శర్మ, జయంత్ సిన్హా, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ ఎన్వీ రమణ, ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ రోహిణి, సీవీసీ కేవీ చౌదరి, రాష్ట్ర మంత్రి కామినేని శ్రీనివాస్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్, ఎంపీలు, పార్టీ నేతలు పాల్గొన్నారు. తెలుగు, తమిళ, కన్నడ కళాకారులు ప్రదర్శించిన శాస్త్రీయ, జానపద నృత్యాలు సభికులను అలరించాయి.
 
వెంకయ్య నా దత్తపుత్రుడు: హెప్తుల్లా

ఛలోక్తులతో ఆకట్టుకునే వెంకయ్య సంక్రాంతి సంబరాలకు హాజరైన కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి నజ్మా హెప్తుల్లాపైనా సరదాకా జోకులేశారు. హెప్తుల్లాకు ఆస్తులు బాగా ఉన్నందున తను ఆమెకు దత్తత వెళ్లానన్నారు. దీనికి ఆమె స్పందిస్తూ.. ‘అవును వెంకయ్యను నేను దత్తత తీసుకున్నాను’ అని అన్నారు.
 
ఫిబ్రవరి మూడో వారంలో బడ్జెట్ భేటీ
వచ్చే నెల 3వ వారంలో బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయని వెంకయ్య  చెప్పారు. పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ బడ్జెట్ సమావేశాల తేదీలను ప్రకటిస్తుందన్నారు. సంక్రాంతి సంబరాల అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఈ బడ్జెట్ సమావేశాల్లో జీఎస్టీ బిల్లును ఆమోదించడానికి విపక్షాలు సహకరించాలని కోరారు. కాంగ్రెస్ చీఫ్ సోనియాను స్వయగా కలిశానని, కాంగ్రెస్ లేవనెత్తిన అంశాలకు సమాధానం ఇచ్చామని తెలిపారు.

ఎస్పీ బాలుకు సత్కారం
గాయకుడిగా 50 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంను ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌లు సత్కరించారు. 50 ఏళ్లపాటు సంగీత యాత్ర కొనసాగించటం సరళమైన పనికాదని ఈ సందర్భంగా మోదీ ప్రశంసించారు. ఉన్నతశిఖరాలకు వెళ్లిన తర్వాత కూడా సాధనను స్వచ్ఛభారత్ కోసం సమర్పించుకోవడం గొప్పవిషయమన్నారు. ఈ సందర్భంగా స్వచ్ఛభారత్ పాటను పాడిన బాలు.. అన్ని భాషల్లో ఈ పాటను తానే పాడతానన్నారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా సత్కారాన్ని అందుకోవడం జీవితంలో మరిచిపోలేనిదన్నారు. తాను పాడిన 40 వేల పాటల్లో స్వచ్ఛభారత్ గీతమే ఉత్తమమైనదని బాలు చెప్పారు.

మరిన్ని వార్తలు