మత్తు మందిచ్చి నిలువు దోపిడీ

20 Nov, 2015 02:38 IST|Sakshi
మత్తు మందిచ్చి నిలువు దోపిడీ

హైదరాబాద్: విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వస్తున్న గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో దొంగలు తెగబడ్డారు. ఏలూరు-తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ల మధ్య రైలులో ప్రయాణికులకు మత్తు మందిచ్చి సొత్తు దోచుకెళ్లారు. వారిచ్చిన శీతల పానీయాలు స్వీకరించిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రయాణికులు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ప్రస్తుతం నగరంలోని గ్లోబల్ ఆసుపత్రిలో వారు చికిత్స పొందుతున్నారు.

రైల్వే పోలీసులు తెలిపిన వివరాలివి... పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఎ.సర్కార్(65), ఎస్.సర్కార్(58), ఎస్.సర్కార్(26)లు గోదావరి ఎక్స్‌ప్రెస్ హెచ్1 ఏసీ కోచ్‌లోని 15, 16, 17 బెర్త్‌ల్లో ప్రయాణిస్తున్నారు. వీరిలో ఒకరు మహిళ. బుధవారం రాత్రి 9.30 గంటల సమయంలో అదే బోగీలో ప్రయాణిస్తున్న అపరిచితులు బాదం పాలలో మత్తు మందు కలిపి ముగ్గురికీ ఇచ్చారు. కొంతసేపటికీ ముగ్గురూ గాఢ నిద్రలోకి వెళ్లిపోయారు. దీంతో దొంగలు వారి వద్దనున్న సొత్తు దోచుకెళ్లారు.

గురువారం ఉదయం రైలు నాంపల్లి స్టేషన్‌కు చేరుకుంది. అపస్మారక స్థితిలో ఉన్నవారిని గమనించిన పోలీసులు గ్లోబల్ ఆసుపత్రికి తరలించారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ముగ్గురూ ఒకే కుటుంబానికి చెందినవారని, ఏపీ, తెలంగాణాల్లో విహార యాత్రకు వచ్చారని పోలీసులు తెలిపారు. వారి వద్ద ఉన్న వీడియో కెమెరా, సెల్‌ఫోన్, ఆపిల్ ఐ ప్యాడ్, రూ.4,630 నగదు, లగేజీని రైల్వే స్వాధీనం చేసుకున్నారు.

హెచ్1 బోగీని ఇన్‌స్పెక్టర్ రంగయ్య బృందం పరిశీలించింది. సంఘటనా స్థలంలో బాదం పాల బాటిల్స్ సేకరించారు. బోగీ ఏసీ మెకానిక్ వెంకటేశ్వర్లును అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రయాణికులు మాట్లాడే స్థితిలో లేరని, కోలుకోగానే పూర్తి వివరాలను రాబడతామని ఇన్‌స్పెక్టర్ చెప్పారు.

మరిన్ని వార్తలు