ప్రమాదంలో ట్రంప్‌.. మారకుంటే అంతే!

6 Jan, 2017 14:41 IST|Sakshi
ప్రమాదంలో ట్రంప్‌.. మారకుంటే అంతే!

ఉపాధ్యక్షుడు జో బిడెన్‌ సంచలన వ్యాఖ్యలు

వాషింగ్టన్‌: మరో 15 రోజుల్లో అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్న డోనాల్డ్‌ ట్రంప్‌ను ఉద్దేశంచి ప్రస్తుత అమెరికా ఉపాధ్యక్షుడు జో బిడెన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జో బిడెన్‌ పలు అంశాలపై మాట్లాడారు.

‘నోరుంది కదాని ఓ మాట్లాడటం, తోచిందల్లా ట్విట్టర్‌లో రాసేయడం సరికాదు! ప్రభుత్వ విధానాలను, ఇంటెలిజెన్స్‌ సంస్థల పనితీరును బాహాటంగా విమర్శించడ ఎంత ప్రమాదకరమో డోనాల్డ్‌ ట్రంప్‌కి ఇంకా తెలియట్లేదు. ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీలపై అవిశ్వాసాన్ని వెలిబుచ్చడం పిచ్చితనం లాంటిదేనని ట్రంప్‌ గుర్తించాలి. నిజానికి ఆయన ఇంకా ఎదగాల్సిఉంది. అడల్ట్‌గా పరిణితి చెందాల్సిన అవసరం ఎంతైనాఉంది. ఎందుకంటే  అమెరికా అధ్యక్షుడిగా చట్టాలు, శాసనాలు చేయాల్సిన బాధ్యత ఆయనపై ఉంటుంది. ఇప్పుడు ఇంత గట్టిగా మాట్లాడుతున్న ఆయన.. రేప్పొద్దున గద్దెనెక్కిన తర్వాత ఏం పొడుస్తాడో మేమూ చూస్తాం!’ అని బిడెన్‌.. ట్రంప్‌పై మండిపడ్డారు.

గతేడాది నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో భారీ విజయం సాధించిన నాటి నుంచి ట్రంప్‌.. ఫెడరల్‌ ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ పలుమార్లు వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్‌ వేదికగా ఇంటెలిజెన్స్‌ సంస్థలపైనా, విదేశీ వ్యవహారాలపైనా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే ఇంటెలిజెన్స్‌ సంస్థల పనితీరును విమర్శిస్తూ జోబిడెన్‌ను టార్గెట్‌ చేశారు. ఇప్పుడు వంతు జో బిజెన్‌ది.

మరిన్ని వార్తలు