ముంబై గ్యాంగ్ ఎలా మాయ చేసిందంటే..

7 Oct, 2016 13:02 IST|Sakshi
ముంబై గ్యాంగ్ ఎలా మాయ చేసిందంటే..
'సుమారు మూడు నెలల క్రితం నాకు ఓ ఫోన్కాల్ వచ్చింది. అందులో అవతలి వైపు మాట్లాడుతున్న వ్యక్తి.. మీరు పన్ను ఎగవేతకు పాల్పడ్డారు. మీ ఇంటికి మరికాసేపట్లో అరెస్ట్ వారెంట్తో పోలీసులు వస్తున్నారు. మీరు ఊచలు లెక్కబెట్టాల్సి ఉంటుందని చెప్పి అని భయానికి గురిచేశాడు. దీంతో ఆ సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న నేను కంగారుపడిపోయాను' అని కాలిఫోర్నియాలో ఉంటున్న వినోద్ వకిల్ అనే 75 ఏళ్ల వ్యక్తి తాను ముంబై కేటుగాళ్ల చేతిలో ఎలా మోసపోయాననే విషయం మీడియాకు వెల్లడించారు. 
 
తరువాత తమను తాము ఇంటర్నల్ రెవిన్యూ సర్వీస్కు చెందిన వ్యక్తులుగా చెప్పుకున్న మోసగాళ్లు.. 5000 డాలర్లు చెల్లిస్తే ఈ వ్యవహారాన్ని సెట్ చేస్తామని వకిల్కు హామీ ఇచ్చారు. ఫోన్లో మాట్లాడిన వ్యక్తి వెంటనే.. లోకల్ స్టోర్కు వెళ్లి క్యాష్ కార్డ్ను కొనమని  చెప్పడంతో.. తాను వృద్దుడినని, ఇప్పటికిప్పుడు బయటకు వెళ్లడం కష్టమని వకిల్ అనగా.. కేటుగాళ్లు మరుక్షణంలో ఎల్లో క్యాబ్ బుక్ చేసి వకిల్ ఇంటిముందు ఉంచారు. వారుచెప్పినట్లే ఐ-ట్యూన్ క్యాష్ కార్డును కొనుగోలుచేసి దాని కోడ్ను ఫోన్లోని వ్యక్తులకు తెలిపాడు వకిల్.
 
అనంతరం లాయర్ ఫీజు కోసం మరో 500 డాలర్లు వెంటనే కావాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు తన దగ్గర ఆ డబ్బు లేదని చెప్పిన వకిల్.. జరిగిన విషయాన్ని తన కుమారుడితో చెప్పాడు. అనుమానం కలిగిన అతను ఆరెంజ్ కౌంటీ పోలీసులను సంప్రదించగా ఆ ప్రాంతంలో ఇలాంటి మోసాలు ఇప్పటికే చాలా జరిగాయని చెప్పడంతో అవాక్కయ్యారు. అమెరికాలోని ఇండియన్స్ను టార్గెట్ చేసుకొని ముంబై ముఠా సాగించిన నేరాలు ఇటీవల బట్టబయలైన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన బాధితులు ఇప్పుడు వివరాలు వెల్లడిస్తున్నారు. 
 
మరిన్ని వార్తలు