మాల్యా తర్వాత.. అరెస్ట్ చేసేది ఆయన్నే

18 Apr, 2017 18:01 IST|Sakshi
మాల్యా తర్వాత.. అరెస్ట్ చేసేది ఆయన్నే

న్యూఢిల్లీ: బ్యాంకులకు దాదాపు 9 వేల కోట్ల రూపాయల బకాయిలను ఎగవేసి విచారణకు హాజరుకాకుండా లండన్‌లో తలదాచుకుంటున్న లిక్కర్‌ కింగ్‌ విజయ్ మాల్యాను భారత్‌ అభ్యర్థన మేరకు బ్రిటన్‌ పోలీసులు అరెస్ట్ చేయడంపై పలువురు రాజకీయ నాయకులు స్పందించారు. మాల్యా తర్వాత ఐపీఎల్‌ మాజీ చైర్మన్‌ లలిత్‌ మోదీని అరెస్ట్‌ చేయవచ్చని బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి అన్నారు.

'మాల్యాను అరెస్ట్‌ చేసినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మోదీ ఎప్పుడూ అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతారు. మాల్యా జైలుకు వెళ్లే సమయం వచ్చింది. ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఈ జాబితాలో తర్వాత లలిత్‌ మోదీ ఉండవచ్చు' అని సుబ్రహ్మణ్య స్వామి ట్వీట్‌ చేశారు. ఐపీఎల్‌లో అవకతవకలకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న లలిత్‌ మోదీ.. ఈడీ విచారణకు హాజరుకాకుండా ఇంగ్లండ్‌లో తలదాచుకుంటున్నాడు. ఆయన్ను రప్పించేందుకు భారత్‌ ప్రయత్నించినా సాధ్యంకాలేదు.

మాల్యాను అరెస్ట్‌ చేయడం భారత ప్రభుత్వం, ఆర్థిక శాఖ పెద్ద విజయమని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ అన్నారు. మాల్యాను భారత్‌కు రప్పిస్తామని మరో కేంద్ర మంత్రి సంతోష్‌ గంగ్వార్‌ అన్నారు.
 

>
మరిన్ని వార్తలు