'మాల్యా నువ్వు కావాలనుకుంటే రావొచ్చు'!

16 Sep, 2016 09:46 IST|Sakshi
'మాల్యా నువ్వు కావాలనుకుంటే రావొచ్చు'!

న్యూఢిల్లీ: భారత్ కు తిరిగి రావాలని ఉన్నా తన పాస్ పోర్టును సీజ్ చేయడం వల్ల రాలేకపోతున్నానని చెప్పిన విజయ్ మాల్యాకు భారతీయ విదేశాంగ శాఖ(ఎమ్ఈఏ) గురువారం ప్రత్యామ్నాయం చూపింది. భారతీయ పౌరులు ఎవరైనా ద్రవీకరణ పత్రాలు సరిగా లేకపోతే.. దగ్గరలోని భారతీయ ఎంబసీకి వెళ్లి అత్యవసర ద్రువీకరణపత్రాన్ని పొంది, తిరిగి స్వదేశానికి రావొచ్చని ప్రకటించింది. 

ఈ మేరకు ప్రకటన విడుదల చేసిన ఎమ్ఈఏ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్.. ఈ సదుపాయం విజయ్ మాల్యాకు కూడా అందుబాటులో ఉంటుందని చెప్పారు. ఈ సదుపాయాన్ని మాల్యా ఉపయోగించుకుంటారా? అని ప్రశ్నించారు. సరైన ద్రవపత్రాలు లేని ఏ భారతీయుడైన అత్యవసర ద్రువీకరణ పత్రాన్ని భారతీయ ఎంబసీ నుంచి తీసుకుని తిరిగి స్వదేశానికి రావొచ్చని చెప్పారు. 

ఈ ఏడాది జులై 9న ఫెరా నిబంధనల ఉల్లంఘన కేసులో మాల్యాను కోర్టుకు హాజరుకావాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో తన పాస్ పోర్టు రద్దు చేయడం వల్ల విచారణకు హాజరుకాలేనని మాల్యా ఈ మెయిల్ చేశారు. మాల్యాపై నమోదయిన ఇతర కేసుల కారణంగా ఆయన పాస్ పోర్టు రద్దు చేయాల్సివచ్చిందని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కోర్టుకు నివేదించింది. కాగా, కేసును న్యాయమూర్తి అక్టోబర్ 4వ తేదీకి వాయిదా వేశారు. నిబంధనలను సడలించిన ఎమ్ఈఏ విదేశాల్లో ఉన్న ఏ భారతీయపౌరుడైన అత్యవసర ద్రువపత్రంతో తిరిగి రావొచ్చని ప్రకటించింది. మరి కోర్టు విచారణకు మాల్యా తిరిగి భారత్ కు వస్తారా? చూద్దాం.

మరిన్ని వార్తలు