పల్లెలు స్వయం సమృద్ధి సాధించాలి

18 Aug, 2015 01:14 IST|Sakshi
పల్లెలు స్వయం సమృద్ధి సాధించాలి

అప్పుడే బంగారు తెలంగాణ సాధ్యం: సీఎం కేసీఆర్
 వరంగల్ జిల్లా గంగదేవిపల్లిలో ‘గ్రామజ్యోతి’ ప్రారంభం

 
వరంగల్: ప్రతి గ్రామం స్వయం సమృద్ధి సాధించినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. ఆ లక్ష్యంతోనే ‘గ్రామజ్యోతి’ కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు. గ్రామాల అభివృద్ధితోనే బంగారు తెలంగాణ సాకారం అవుతుందని చెప్పారు. సోమవారం వరంగల్ జిల్లా గీసుగొండ మండలం గంగదేవిపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ‘గ్రామజ్యోతి’ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. అనంతరం గ్రామ సర్పంచ్ అధ్యక్షతన జరిగిన గ్రామసభను ఉద్దేశించి ప్రసంగించారు. ‘‘భారతీయులంతా వ్యక్తిగతంగా గొప్పవాళ్లే గానీ సంఘంగా మంచి పనులు చేయడంలో మాత్రం విఫలమైతున్నరు. గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించినప్పుడే స్వయం సమృద్ధి సాధ్యం. కొట్లాడి సాధించుకున్న తెలంగాణను ఎన్నికలు, రాజకీయాలు, గొడవలు, విసుగులు పక్కనబెట్టి సమష్టిగా అభివృద్ధి చేసుకుందాం.

మంచి చేసేటప్పుడు వ్యతిరేకించేవాళ్లు ఎప్పుడూ ఉంటరు. వాళ్లను పట్టించుకోకుండా ముందుకు పోవాలె. సంఘటితంలో గొప్ప శక్తి ఉంది. గంగదేవిపల్లిలా ఐక్యంగా ముందుకు పోతే వ్యతిరేక స్వభావులందరికీ సమాధానం చెప్పొచ్చు. బంగారు తెలంగాణ సాధించుకోవాలె. గ్రామాలన్నీ స్వయం సమృద్ధి సాధిస్తెనే అది సాధ్యం. ఊళ్లె ఎవరన్న ఉపాసంతోని ఉంటె ఊరికి ఇజ్జతి ఉంటదా? ఊళ్లో అందరు ఒకలా ఉండరు. కొందరు కొంత మీదికి, కొందరు కిందికి ఉంటరు. అందరు కలిసి ఉన్నంతలో మంచిగ బతికేలా ఒకరికొకరు సహకరించుకోవాలి. గ్రామంలో ఒకరికి చెప్పుల దుకాణం పెట్టించి అందరూ అక్కడే కొనుగోలు చేస్తే ఒకరికి ఉపాధి కలుగుతుంది. అలాగే ఓ ఆడ, మగకు టైలరింగ్‌లో శిక్షణ ఇప్పించి ఊళ్లో అందరూ అక్కడే బట్టలు కుట్టించుకుంటే ఊరి అవసరాలు తీరుతయి. వారికి ఉపాధి ఉంటుంది. వ్యవసాయంలోనూ పద్ధతులు మారాలి. తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి వచ్చేందుకు డ్రిప్ బాగా ఉపయోగపడుతుంది.

నేను రైతునే. అనుభవంతో చెబుతున్నా. డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిలోనే సాగు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి’’ అని కేసీఆర్ అన్నారు. ‘‘ఎవరో ఏదో చేయాలనే భావన వద్దు. మనలో ఎంత శక్తి ఉందో ఆలోచిస్తలేం. గ్రామాన్ని చక్కగా పెట్టుకోవాలి. చాలా గ్రామాలు పరిశుభ్రత విషయంలో బాగా లేవు. గ్రామంలోని అందరూ కలిసి ఒక్క రోజు చీపురు పడితే చెత్త అనేది కనిపిస్తదా. సంఘటితంగా కదిలితే అన్ని జరుగుతయి. సంఘటితంగా అభివృద్ధి సాధిస్తున్న గంగదేవిపల్లి, అంకాపూర్(నిజామాబాద్ జిల్లా)ను అందరు స్ఫూర్తిగా తీసుకోవాలి. అప్పుడే బంగారు తెలంగాణ సాకారమైతది’’ అని పేర్కొన్నారు.

 గ్రామంపై వరాల జల్లు..
 గంగదేవిపల్లిపై సీఎం వరాల జల్లు కురిపించారు. గ్రామంలో రైతులందరికీ డ్రిప్ ఇరిగేషన్ మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. ‘‘మోటారు లేని వారికి బీసీ కార్పొరేషన్ ద్వారా ఇప్పించేలా చూస్తం. ఈ ఊరిలో ఇళ్లులేని పేదలు ఉన్నరు. 80 కుటుంబాలకు డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్లు మంజూరు చేస్తున్నం. వీటిని వెంటనే మొదలుపెట్టండి. గంగదేవిపల్లికి ఇంగ్లిష్ మీడియం రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు చేస్తున్న. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఈ పని పూర్తి చేస్తరు. 100 కేవీ ట్రాన్స్‌ఫార్మర్ మంజూరు చేస్తున్న. గ్రామంలోని పెద్ద కుంటను మిషన్ కాకతీయలో అభివృద్ధి చేస్తాం. రెండు చెక్ డ్యామ్‌లు నిర్మిస్తాం. గంగదేవిపల్లి వాసులు నిజామాబాద్ జిల్లా అంకాపూర్‌ను సందర్శించాలి. రెండు బస్సులు ఏర్పాటు చేస్త. అందరు వెళ్లి రండి. ప్రగతి రిసార్ట్స్‌లో ప్రత్యేక మొక్కలు ఉన్నయి. వాటిని తెచ్చి పెడదాం. పరిసరాలను బాగా పెట్టుకుందాం. గంగదేవిపల్లి దోమలు లేని గ్రామం కావాలి. మొత్తానికి గంగదేవిపల్లి బంగారం కావాలి. ఏది చూసినా బాగుండాలి. చూసిరావాలిరా గంగదేవిపల్లి.. అనేట్లుగా ఉండాలి’’ అని అన్నారు.

 రాంపూర్ అభివృద్ధికి కోటి చెక్కు
 గంగదేవిపల్లి సభ అనంతరం ముఖ్యమంత్రి నర్సంపేట నియోజకవర్గం నల్లబెల్లి మండలం మేడపల్లి-రాంపూర్‌లో జరిగిన గ్రామజ్యోతి సభలో మాట్లాడారు. యశోద హాస్పిటల్ నిర్వాహకులు గోరుగంటి రవీందర్‌రావు, సురేందర్‌రావు, దేవేందర్‌రావు తమ సొంతూరు రాంపూర్ అభివృద్ధి కోసం రూ.కోటి చెక్కును ఈ సభలో ముఖ్యమంత్రికి అందజేశారు. అలాగే గ్రామాభివృద్ధి కోసం 35 గుంటల భూమిని విరాళంగా ఇచ్చారు. మేడపల్లి-రాంపూర్ అభివృద్ధి కోసం రూ.5 కోట్లు మంజూరు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. స్పీకర్ మధుసూదనాచారి, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, జెడ్పీ చైర్‌పర్సన్ గద్దల పద్మ తదితరులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
 
ఏడాదిలో మళ్లీ వస్తా..
‘‘గంగదేవిపల్లికి నేను రాలే. ఈ ఊరి స్ఫూర్తి నన్ను రప్పించింది. 24 ఏళ్లుగా గ్రామస్తులు ఐక్యంగా చేస్తున్న కృషితో విదేశాల్లోనూ ఈ ఊరి శక్తి తెలిసింది. అంతర్జాతీయంగా గంగదేవిపల్లి ఆదర్శంగా నిలిచింది. అన్ని ఊళ్లు ఈ స్ఫూర్తిని కొనసాగించాలి. ఒకరినొకరు మంచిగ పలకరించుకోవాలె. మోటు మాటలు బంద్ జేయాలె. ఒకరినొకరు తిట్టుకోవద్దు. ఏడాదిలోనే మళ్లీ గంగదేవిపల్లికి వస్తా’’ అని కేసీఆర్ చెప్పారు. అంతకుముందు సీఎంకు గ్రామస్తులు బోనాలు, బతుకమ్మలతో స్వాగతం పలికారు. కాలినడకన సీఎం స్థానికులను పలకరిస్తూ గ్రామం గురించి తెలుసుకున్నారు. హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. గ్రామస్తులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.
 
రూ.10 కోట్లు మంజూరు
గ్రామంలోని వివిధ పనుల కోసం రూ.7.28 కోట్లు కావాలని ముఖ్యమంత్రికి గంగదేవిపల్లి గ్రామ అభివృద్ధి కమిటీ విన్నవించింది. ఈ ప్రతిపాదనలకు స్పందించిన కేసీఆర్ గ్రామాభివృద్ధికి రూ.10 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ‘‘మీరు అన్నట్లు రూ.7.28 కోట్లు కాదు రూ.10 కోట్లు మంజూరు చేస్తున్న. రేపే(మంగళవారం) ఈ నిధులను జిల్లా కలెక్టర్ వద్ద పెడుతం. ఈ నిధులతో ఏ పనులు చేయాలనేది గ్రామ సభలో నిర్ణయించుకోవాలి’’ అని
 పేర్కొన్నారు.
 

>
మరిన్ని వార్తలు