300 కోడిగుడ్లతో అద్భుతం చేశాడిలా..

8 Nov, 2016 16:34 IST|Sakshi
300 కోడిగుడ్లతో అద్భుతం చేశాడిలా..

‘బెదిరింపుకు భాష అవసరంలేదప్పా..’ అంటాడో రచయిత. నిజమే బెదిరింపులకే కాదు జీవితానికి సంబంధించిన చాలావిషయాలకు భాష అనవసర వ్యవహారం. పావుగంటలో 300 కోడిగుడ్లతో అద్భుతాన్ని రుచిచూపించగల ఈ వ్యక్తి విషయంలోనూ భాష అసలు సమస్యేకాదు. ఇతని పేరు కాసేపు ’తంబి’ అనుకుందాం. ఉండేది తమిళనాడులోని ఓ మారుమూల గ్రామంలోనైనా వరల్డ్ ఫేమస్ అయిపోయాడిప్పుడు. ఊళ్లో తాను ఏం వండుకుని తింటాడో.. మాతృభాషలో వివరిస్తూ నెట్టింట్లో సంచలననాలు సృష్టిస్తున్నాడు.

ఇంతకీ ఇతనేం చేశాడంటే.. 300 కోడిగుడ్లతో సింపుల్ గా కూర వండేశాడు. గ్యాస్ పొయ్యి గట్రా లేకుండా పూర్తి గ్రామీణ వాతావరణంలో ఇటుకల పొయ్యిమీద తంబి వండిచూపించే వంటలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ‘విలేజ్ ఫుడ్ ఫ్యాక్టరీ’ అనే యూట్యూబ్ చానెల్ లో నవంబర్ 4న తంబి వండిన 300 కోడిగుడ్ల కూరను ఇప్పటివరకు 20 లక్షల మందికిపైగా చూశారు. కళ్లతోనే కూరను రుచిచూసి ’వహ్వా..’ అన్నారు.

2015లో ప్రారంభమైన ‘విలేజ్ ఫుడ్ ఫ్యాక్టరీ’లో స్థానిక వంటకాలకు సంబంధించిన వీడియోలు ఎన్నో అందుబాటులో ఉన్నాయి. ఒక్క తమిళనాడేకాదు, థాయిలాండ్, బ్యాంకాక్ తదితన దేశాల్లోని గ్రామీణులు సైతం లోకల్ వంటకాలను ప్రపంచానికి రుచిచూపిస్తున్నారు. మన తంబి విషయానికి వస్తే ప్రస్తుత 300 కోడిగుడ్ల కూరే కాక అరుదైన చేపల కూర, మేక మాంసం కూర, పీతలు, రొయ్యలు.. ఇలా పదుల సంఖ్యలో వీడియోలున్నాయి. వంటలో తండ్రికి సాయం చేసే తంబి కొడుకులు ఈ వీడియోలు తీసి యూట్యూబ్ చానెల్ లో అప్ లోడ్ చేస్తారట. మీదైన విలేజ్ వంటకం ఏదైన ఉంటే ట్రై చేయండి.. తంబిలా మీరూ సోషల్ మీడియా సెలబ్రిటీ కావచ్చేమో!