చలసాని మహాప్రస్థానం

25 Jul, 2015 16:20 IST|Sakshi
చలసాని మహాప్రస్థానం

చలసాని ప్రసాద్.. ఓ సమున్నత శిఖరం. నిరంతర చైతన్య స్రవంతి. అలుపెరుగని శ్రామికులు. ఆయన జీవించి ఉన్న కాలంలో 'సాక్షి' విశాఖ ఎడిషన్లో 'విశాఖ శిఖరాలు' శీర్షికన నిర్వహించిన ఫీచర్లో చలసాని గురించి కూడా సమగ్రంగా వివరించాం. చలసాని ప్రసాద్ శనివారం ఉదయం 11.30 గంటలకు మరణించారు. ఈ సందర్భంగా ఆయన గురించిన కథనాన్ని మరొక్కసారి చూద్దాం..

'కొంతమంది యువకులు ముందు యుగం దూతలు.. పావన నవజీవన బృందావన నిర్మాతలు' అన్నాడు మహాకవి శ్రీశ్రీ. అప్పటికి ఆయనకు చలసాని ప్రసాద్ వంటి వాళ్లెవరూ పరిచయం కాలేదనాలేమో. అయి ఉంటే మాత్రం 'కొంతమంది వృద్ధులు నేటి తరపు యువకులు.. అలుపెరుగని శ్రామికులు.. నవలోకపు కార్మికులు' అని ప్రత్యేకించి ప్రకటించేవాడేమో. నిజమే మరి.. ఎనిమిది పదుల వయస్సులో  కూడా పరుగులు తీసిన చలసాని నేటి తరపు యువకులెందరికో అసూయ పుట్టించే నిత్య చైతన్యవంతుడు. తాను విశ్వసించే సిద్ధాంతం కోసం అహరహం పనిచేసిన సమసమాజ శ్రామికుడు. తాను ఆశించే రేపటి మరో ప్రపంచం నేడే సాకారం కావాలని, స్వప్న సాక్షాత్కారం కావాలని పరిశ్రమించిన, పరితపించిన నవ్యలోకపు కార్మికుడు.
 
దగమనంతో సాగే ద్విచక్రవాహనాన్ని నడిపిస్తూ, పరిచయస్తుల అభివాదాలకు ప్రతిస్పందిస్తూ మామూలుగా కనిపించే ఆ వ్యక్తిలో ఇంత శక్తి దాగి ఉందంటే తెలియని వారు నమ్మడం కష్టమే. కానీ ఆయన గురించి తెలిసిన వారికి చలసాని ప్రసాద్ చైతన్య స్వరూపం ఆశ్చర్యమనిపించదు.  పధ్నాలుగేళ్లు కష్టపడి ఇరవై భాగాలుగా శ్రీశ్రీ సాహితీ సర్వస్వాన్ని ప్రచురించినా, అదే తరగని ఉత్సాహంతో రావిశాస్త్రి, కొడవటిగంటి కుటుంబరావుల సాహిత్యమంతటినీ సంపుటాలుగా వెలువరించినా అది చలసానికే చెల్లింది. 1970లో విప్లవ రచయతల సంఘాన్ని స్థాపించిన నాటి నుంచి విరసంతో ఆయన అనుబంధం కొనసాగింది. వాడీవేడి గల సంస్థగా ఆవిర్భవించిన విరసాన్ని అదే బాటలో ఉరకలు వేయించడంలో చురుకైన పాత్ర నిర్వహించారు.
 
అయితే చలసాని ప్రసాద్ అక్కడితో ఆగిపోలేదు. ఆయన వాడీవేడి గల సంస్థగా ఆవిర్భవించిన విరసాన్ని అదే బాటలో ఉరకలు వేయించడంలో ఆయన పాత్ర అద్వితీయమైనది. అయితే చలసాని ప్రసాద్ అక్కడితో ఆగిపోలేదు. ఆయన ఆశ అనంతం. ఆయన దృష్టి అఖండం. ఆయన చూపు రేపటి ప్రపంచం వైపు. మహాకవి మాదిరిగానే ఆయనకూ రేపటి సూర్యోదయంపై అంతులేని విశ్వాసముంది. శ్రామిక లోకపు కల్యాణం సాధ్యపడే ఆ మరో ప్రపంచం అరుదెంచే రోజు చేరువవుతోందన్న కొండంత భరోసా ఉంది. ఆ వి'శ్వాస'మే ఆయన్నునేటికీ పరుగులు తీయించింది.
 
కమ్యూనిస్టు కుటుంబంలో పుట్టి మార్క్సిస్టుగా పెరిగి, మావోయిస్టుగా స్థిరపడ్డ చలసాని జీవితం శ్రీశ్రీ సాహిత్యమంత విస్తారమైనది. ఆయన ఆలోచన, కృషి రావిశాస్త్రి రచనల్లోని పాత్రలంత విస్తృతమైనవి. ప్రజా సాహిత్యమన్నా, శ్రామిక విప్లవమన్నా ఆయనకు అంతులేని మమకారం. ఆ ప్రేమాభిమానాల కారణంగానే కష్టజీవులకు అటూఇటూ నిలబడ్డ శ్రీశ్రీ, రావిశాస్త్రి ఆయనకు పంచప్రాణాలయ్యారు. విప్లవపోరాటాలకు ప్రజలను కార్యోన్ముఖులను చేసే సాహితీ సృజన కోసం ఆయన విరసం ఉద్భవించే చారిత్రాత్మక పరిణామంలో తన వంతు పాత్రను సమర్థవంతంగా నిర్వహించారు. 1970లో శ్రీశ్రీ షష్టిపూర్తి సభను ఇందుకు వేదికగా మలచారు. ఆ రెండు మహత్తర సంఘటనలూ శ్రీశ్రీకి, చలసానికి అత్యంత ఇష్టమైన విశాఖలోనే జరగడం విశేషం.
 
 అదే ఉత్సాహం
విరసం ఏర్పడి నాలుగు దశాబ్దాలయినా చలసాని ఉత్సాహం అప్పటికీ ఇప్పటికీ ఝరీపాత సమానమే. ఉత్తరాంధ్రలో విప్లవోద్యమ కార్యకారణ పరిణామాలు ఏవి చోటు చేసుకున్నా చలసాని మద్దతు ఉండనే ఉంటుంది. ప్రజా సాహిత్య సంబంధమైన రచనా వ్యాసంగంతోనో, పుస్తకాల ప్రచురణతోనో ఆయన ఆగిపోరు. విప్లవ యోథుల సరసన కలం యోథుడిగా దీటుగా నిలుస్తారు. విప్లవోద్యమానికి సంబంధించి ఏ ఉద్యమకారుడు కారాగారం పాలైనా, ఏ అమాయకులు పోలీసుల దమనకాండకు గురైననామొదటి పరామర్శ చలసానిదే.
 
ఏ కీకారణ్యంలో కూంబింగ్ వేటలో ఏ విప్లవకారుడు నేలకొరిగినా రాలే తొలి కన్నీటి బొట్టు చలసానిదే. ఎక్కడ పోరు పాట వినపడ్డా, ఎక్కడ సమర శంఖం పూరించినా ఆయన పరుగున తరలి వెళ్తారు. ఉద్యమాలలో అగ్రపీఠిన నిలబడతారు. ఉద్యమానికి, సాహిత్యానికి వంతెనలా ఇంత భారాన్నీ మోస్తూ అంతర్లీనంగా ప్రవహించే చైతన్య స్రవంతితో నవయువకుడిగా పరుగులు తీశారు. ఆయన వాహనం నేటికీ ఏనాటికీ పంచకల్యాణి. ఆయన అలపూసొలుపూ లేని నవ్యోత్సాహ వాహిని.
 
 తెలుగుకు ఢోకా లేదు

‘కొందరు భయపడుతున్నట్టు తెలుగుకేం ఢోకా లేదు. గతంలో సంస్కృతాన్ని, ఇప్పుడు ఇంగ్లీషును ఎదిరించి నిలిచిన భాష తెలుగు. ఏ భాషా పదాన్నయినా తనలో కలుపుకొని ఎదిగే శక్తి తెలుగుకు ఉంది. అందుకే తెలుగు అజరామరం. తెలుగు భవిష్యత్తు ఉజ్వలం’ అని చలసాని చెబుతారు.
 
 ఏ మూల చూసినా పుస్తకాలే
 ఏడెనిమిది మంది డాక్టరేట్లకు ఇవే ఆధారం..

 
ఎవరైనా ఇల్లు నివసించడానికి కట్టించుకుంటారు. చలసాని మాత్రం పుస్తకాలను కొలువు తీర్చడానికే ఇంటిని కట్టుకున్నారు. మేడమీద ఓ గది వేసినా, ఇంటిని ఇంకాస్త పొడిగించినా అది పుస్తకాల కోసమేనంటారు. అందరిళ్లలో దేవుడి గది, భోజనాల గది వగైరా ఉంటే ఆయన ఇంట్లో శ్రీశ్రీ గది, రావి శాస్త్రి గది, కొకు గది అని ఉంటాయి. ఇంట్లోని ఎనిమిది గదుల్లోనూ పుస్తకాలే ఉంటాయంటే చలసాని అభిమానం ఎటువంటిదో అర్థమవుతుంది.
 
ఆయన పుస్తకాలయంలో ఇరవై వేల పుస్తకాలున్నాయంటే ఆ మమకారం ఏపాటిదో అవగతమవుతుంది. ఆయన దగ్గరి పుస్తకాల ఆధారంగా ఏడెనిమిది మంది పీహెచ్‌డీలు చేశారు. ఎందరో పఠనాభిలాషులు వచ్చి నిత్యం ఏదో సమాచారం సేకరించుకుని పోతూ ఉంటారు. ‘పోలీసులెవరికైనా పార్వతీపురం కుట్రకేసుపై ఏవైనా సందేహాలు తలెత్తితే హోంశాఖ ప్రచురించిన 22 భారీ సంపుటాల కోసం చలసాని ఇంటికి రావాల్సిందే’ అని ఆయన సన్నిహితులు అంటారు.
 
 అడ్డపొగ ఇష్టం
 

విశాఖపట్నం అంటే, ఉత్తరాంధ్ర మహిళాలోకమంటే చలసానికి చాలా అభిమానం. ‘ఉత్తరాంధ్ర మహిళలు శ్రమజీవులు. కల్లాకపటం లేనివారు’ అంటారాయన. వారి నిష్కపటం, శ్రమజీవనం, వినయం గొప్ప విషయాలని చెబుతారు. ఇక్కడి గ్రామీణ మహిళలు అడ్డపొగ కాల్చడం నచ్చుతుంది.. అంటారు చలసాని. విశాఖ అంటే శ్రీశ్రీ. విశాఖ అంటే రావిశాస్త్రి. జీవితమంతా విశాఖే. అందుకే ఈ ఊరంటే ప్రత్యేక మమకారం.. అని చెబుతారు.
 
 అందరికీ బాబాయ్
 
ఆమధ్య అమరుడైన మావోయిస్టు నేత ఆజాద్ నుంచి వర్థమాన రచయతల వరకు అందరికీ ఆయన బాబాయ్‌గా చిరపరిచితుడు. ఎవరు బాబాయ్ అని పిలిచినా చలసాని మహాకవికి మాత్రం ఆయన వేరే వరస! చలసానిని శ్రీశ్రీ సరదాగా నా మూడో భార్య అని వ్యవహరించేవారట మరి!
 
 ఎన్నో అవతారాలు
 
కృష్ణాజిల్లాలోని ఓ సాధారణ కుటుంబంలో జన్మించిన చలసాని ప్రసాద్ బాల్యం నుంచి కమ్యూనిస్టు ఉద్యమాన్ని చూస్తూ, ఆస్వాదిస్తూ పెరిగారు. తెలంగాణా సాయుధ పోరాటంలో ఆయన కుటుంబం ప్రత్యక్షంగా పాలుపంచుకుంది. ఉద్యమం లో ఆయన కుటుంబ సభ్యులు ముగ్గురు నేలకొరిగారు. ఏయూలో ఎమ్మే చేసిన తర్వాత జీవిక కోసం రకరకాల ఉద్యోగాలు చేశారు. కొంతకాలం సినీమాయాజగత్తులో సహాయ దర్శకుడిగా, రచయితగా కొనసాగారు. చివరికి ఏవీఎన్ కళాశాలలో అధ్యాపకుడిగా స్థిరపడ్డారు.
 
 జీవన చిత్రం
 
పుట్టినది: 08-12-1932
మరణం: 25-07-2015
జన్మస్థలం: భట్ల పెనుమర్రు, కృష్ణాజిల్లా
తల్లితండ్రులు: బసవయ్య,   వెంకట నరసమ్మ
భార్య:   (దివంగత) విజయలక్ష్మి
కుమార్తెలు: నవత ( జర్నలిస్ట్),
మమత ( ఏవీఎన్ కాలేజీ లెక్చరర్)
చదువు: ఎం.ఎ (పొలిటికల్ సైన్స్)  ఏయూ-1957
ఉద్యోగం: మత్స్యశాఖలో ఎల్‌డీసీ  1957-59
రైల్వేలో క్లర్క్ 1960-62
కలిమి లేములు తదితర సినిమాలకు సహాయ దర్శకుడు
దర్శకుడు ప్రత్యగాత్మకు సహాయకుడు 1963-67
ఏవీఎన్ కళాశాల రాజనీతిశాస్త్ర అధ్యాపకుడు 1968-92

మరిన్ని వార్తలు