ఈ ఏడాది15వేల కోట్ల టర్నోవర్

14 Sep, 2013 02:18 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: 2013-2014 ఆర్థిక సంవత్సరంలో  3.47 మిలియన్ టన్నుల సేలబుల్ స్టీల్ ఉత్పత్తితోపాటు ప్లాంట్ టర్నోవర్‌ను రూ.15వేల కోట్లు దాటించే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు విశాఖ స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం ప్రకటించింది. ప్రస్తుతం విస్తరణ పనుల ద్వారా ఆర్‌ఐఎన్‌ఎల్ 6.3 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తికి సిద్ధంగా ఉందని, ఇప్పటికే కొన్ని యూనిట్లు ఉత్పత్తికి సిద్ధమయ్యాయని, మిగిలిన యూనిట్లలో ఉత్పాదక కార్యకలాపాల్ని ఈ ఆర్థిక సంవత్సరం చివరినాటికి అందుబాటులోకి తేనున్నట్లు ప్లాంట్ సీఎండీ ఏపీచౌధురి చెప్పారు.  
 
 ఆయన స్టీల్‌ప్లాంట్ ఫైనాన్స్ డెరైక్టర్ (2014 నుంచి కొత్త సీఎండీ) మధుసూదన్, మార్కెటింగ్ డెరైక్టర్ టీకే చాంద్‌తో కలసి విశాఖ ఉక్కు భవిష్యత్తు ప్రణాళికలను విలేకరుల సమావేశంలో వివరించారు. ప్రస్తుతం ప్లాంట్ ఉత్పాదక సామర్థ్యాన్ని బలోపేతం చేయడం ద్వారా లిక్విడ్ స్టీల్ ఉత్పత్తిని 7.3 మెట్రిక్ టన్నులకు పెంచడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నిర్వహణ, కొనుగోలు విభాగాల్లో క్రమశిక్షణాయుతమైన ఆర్థిక నిర్వహణ పద్ధతుల ద్వారా సంస్థకు గడచిన 2012-2013 ఆర్థికసంవత్సరంలో రూ.207కోట్లను ఆదాచేశామని, అందువల్ల గతేడాది ప్లాంట్ మొత్తం రూ.353కోట్ల లాభాలు సాధించిందని తెలిపారు. 2013-2014 ఏడాదిలో తొలి 5నెలల్లో స్టీల్‌ప్లాంట్ సేలబుల్ స్టీల్ విభాగం 9 శాతం రికార్డు స్థాయి వృద్ధి నమోదు చేసిందన్నారు. విస్తరణ పనులు మరికొద్దిరోజుల్లో పూర్తికానున్నందున పూర్తిస్థాయి సామర్థ్యంతో పనిచేసి సేలబుల్ స్టీల్ విభాగంలో అనుకున్నట్లు  20 శాతం వృద్ధి లక్ష్యాన్ని చేరుకుంటామని ఆశాభావం వ్యక్తంచేశారు. ప్రస్తుతమున్న హాట్‌మెటల్ ఉత్పత్తిని సామర్థ్యం పెంచి 4.5 మిలియన్ టన్నులకు చేర్చుతామని చెప్పారు.

>
మరిన్ని వార్తలు