33సార్లు క్షమాపణ చెప్పాడు!

28 Aug, 2016 18:50 IST|Sakshi
33సార్లు క్షమాపణ చెప్పాడు!

న్యూఢిల్లీ: జైన దిగంబార సాధువు తరుణ్‌ సాగర్‌ హర్యానా అసెంబ్లీలో ప్రసంగించడంపై ట్విట్టర్‌లో విమర్శలు చేసిన బాలీవుడ్ సంగీత దర్శకుడు విశాల్ దద్లానీ ఊహించనిరీతిలో వివాదాలకు కేంద్రమయ్యాడు. ట్విట్టర్‌లో అతడి విమర్శలు దుమారం రేపాయి. జైన దిగంబర బాబాను విమర్శిస్తావా? అంటూ చాలామంది ఆయనను వేలెత్తిచూపారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ సైతం విశాల్‌ విమర్శలను ఖండించారు. దీంతో అరవింద్‌ కేజ్రీవాల్‌ సహా చాలామంది నెటిజన్లకు ఆయన క్షమాపణ చెప్పారు. ఏ మతం వారిని కించపరచడం, ఏ మతవిశ్వాసాలను గాయపరచడం తన ఉద్దేశం కాదని, మతాన్ని పరిపాలనను జోడించకూడదనే ఉద్దేశంతోనే తాను వ్యాఖ్యలు చేశానని విశాల్‌ వివరణ ఇచ్చుకున్నాడు. తన వ్యాఖ్యలు జైనుల మనోభావాలను దెబ్బతీస్తే.. అందుకు మనస్ఫూర్తిగా క్షమించాలని వినమ్రంగా కోరాడు.

ట్విట్టర్‌లో తనను విమర్శించిన చాలామందికి విశాల్‌ క్షమాపణలు చెప్తూపోయారు. తాను చేసిన ఒక్క ట్వీట్‌ మీదనే ఆయన ఏకంగా 33సార్లు క్షమాపణ చెప్పారు. అంతేకాకుండా తాను రాజకీయాల నుంచి తప్పుకొంటున్నట్టు విశాల్‌ ప్రకటించాడు. ఇన్నాళ్లు ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతుదారుడిగా, కార్యకర్తగా విశాల్ దద్లానీ కొనసాగారు. ఏకంగా కేజ్రీవాల్‌ తనను తప్పుపట్టడంతో ఆ పార్టీకి గుడ్‌బై చెప్పడమే కాకుండా రాజకీయాలకు దూరంగా ఉంటానని విశాల్‌ తెలిపారు. మరోవైపు ప్రముఖ జైన దిగంబర ముని తరుణ్‌ సాగర్‌ విశాల్ దద్లానీ విమర్శలపై స్పందించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ అసమ్మతి తెలిపే హక్కు ఉంటుందని, విమర్శలను తాను పట్టించుకోబోనని తెలిపారు.

మరిన్ని వార్తలు