దేశీయ భాగస్వామి వాటాపై వొడాఫోన్ కన్ను

25 Sep, 2013 02:31 IST|Sakshi

 న్యూఢిల్లీ: దేశీయ టెలికం సంస్థ వొడాఫోన్ ఇండియాలో పూర్తి వాటాను సొంతం చేసుకోవాలని బ్రిటిష్ టెలికాం దిగ్గజం వొడాఫోన్ యోచిస్తోంది. దీనిలో భాగంగా దేశీయ భాగస్వాములు అజయ్ పిరమల్(పిరమల్ హెల్త్‌కేర్), అనల్జిత్ సింగ్ వాటాలను కొనుగోలు చేయాలని ప్రణాళికలు వేస్తోంది. ఇందుకు సంబంధించి ప్రయత్నాలు జరుగుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. తద్వారా తమ వాటాను 100%కు చేర్చుకోవాలని వొడాఫోన్ భావిస్తున్నట్లు పేర్కొన్నాయి.
 
 ఈ అంశంపై కంపెనీ స్పందించనప్పటికీ, ఎస్సార్ గ్రూప్ నుంచి వాటాను కొనుగోలు చేయడం ద్వారా 2011లో తమ వాటాను 74%కు పెంచుకున్న విషయం విదితమే. అప్పటి వొడాఫోన్ ఎస్సార్‌లో ఎస్సార్‌కుగల 33% వాటాను 2011 జూలైలో 546 కోట్ల డాలర్లకు బ్రిటిష్ వొడాఫోన్ సొంతం చేసుకుంది. కాగా, మరోవైపు 2011 ఆగస్ట్‌లో రూ. 2,900 కోట్లను వెచ్చించడం ద్వారా వొడాఫోన్ ఇండియాలో పిరమల్ హెల్త్‌కేర్ 5.5% వాటాను దక్కించుకుంది. ఆపై తమ వాటాను 11%కు పెంచుకుంది. ఇక మ్యాక్స్ ఇండి యా ప్రమోటర్ అనల్జిత్ సింగ్‌కు సైతం వొడాఫోన్ ఇండియాలో 6% వాటా ఉంది.
 

మరిన్ని వార్తలు