మార్చురీ వద్దే పడిగాపులు

2 Nov, 2013 02:05 IST|Sakshi
మార్చురీ వద్దే పడిగాపులు

ఉస్మానియా ఆస్పత్రి వద్ద బస్సు దుర్ఘటన మృతుల బంధువుల నిరీక్షణ  
గుర్తించిన మృతదేహాలను అప్పగించాలంటూ వేడుకోలు

 
 సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లాలో బస్సు దగ్ధమైన ఘటనలో మృతి చెందినవారికి సంబంధించిన వివరాలుగానీ, మృతుల వస్తువులకు సంబంధించిగానీ ఏదైనా వివరాలు కావాలంటే హైదరాబాద్‌లోని అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్లో గానీ, ఉస్మానియా ఆస్పత్రిలోని పోలీస్ హెల్ప్‌లైన్ కేంద్రంలోగానీ సంప్రదించాలని ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండెంట్ తెలిపారు. మరోవైపు.. కొందరు మృతుల బంధువులు శుక్రవారం ఉస్మానియా మార్చురీ వద్దకు తరలివచ్చారు. దీంతో ఉస్మానియా ఆస్పత్రి ప్రాంగణం అయిన వారి దుఃఖంతో  కన్నీటి సంద్రమైంది. మృతుల బంధువులు కొందరు రెండు రోజుల నుంచీ మార్చురీ వద్దే నిరీక్షిస్తున్నారు. ఆభరణాలు, వస్తువులను బట్టి తమవారి మృతదేహాలను గుర్తించామని, వాటిని తమకు అప్పగించాలని విన్నవిస్తూనే ఉన్నారు.
 
 కాగా.. అఫ్జల్‌గంజ్ పీఎస్‌ను నోడల్ కేంద్రంగా ఏర్పాటు చేశామని, మృతదేహాలు ఆస్పత్రి మార్చురీలో ఉన్నా అవి పోలీసుల అధీనంలోనే ఉంటాయని అధికారులు చెప్పారు. ప్రస్తుతం ఉస్మానియా మార్చురీలో 42 మృతదేహాలున్నాయని, వాటిని కోడ్ నంబర్లతో భద్రపరిచామని పేర్కొన్నారు. మృతదేహాల శాంపిళ్లకు, బంధువుల డీఎన్‌ఏ నమూనాలు సరిపోలి.. పోలీసులు అనుమతించిన తర్వాత మృతదేహాలను అప్పగిస్తామన్నారు. వైద్య విద్య డెరైక్టర్ ఈ మృతదేహాలకు సంబంధించిన నివేదికను వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శికి ఇచ్చారు.  కాగా.. గురువారం 41 మంది మృతులకు సంబంధించిన బంధువులు వారి డీఎన్‌ఏ నమూనాలు ఇవ్వగా... మిగతా ఒక్క మృతుడు ఉత్తరప్రదేశ్‌కు చెందిన గ్లాస్ కాంట్రాక్టర్ అజయ్ చౌహాన్ సోదరుడు వినోద్ చౌహాన్ శుక్రవారం డీఎన్‌ఏ శాంపిల్ ఇచ్చారు. దీంతో డీఎన్‌ఏ నమూనాల సేకరణ ముగిసినట్లు మహబూబ్‌నగర్ ఓఎస్‌డీ ఆపరేషన్స్ బి.కమలాకర్‌రెడ్డి ప్రకటించారు. డీఎన్‌ఏ పరిశీలన నివేదిక రావడానికి వారం రోజులకు పైనే పడుతుందని, ఆ తర్వాత మృతదేహాలను బంధువులకు అప్పగిస్తామని అసిస్టెంట్ కలెక్టర్ విజయకుమార్ రాజు పేర్కొన్నారు. మృతదేహాలను గుర్తించిన అనంతరం తామే బంధువులకు ఫోన్‌ద్వారా సమాచారం ఇస్తామని, స్వస్థలాలకు తరలించే ఏర్పాట్లు చేస్తామని వెల్లడించారు.
 
 వారం రోజులు ఎక్కడుండాలి..?
 బస్సు దుర్ఘటనలో మరణించిన అజయ్ చౌహాన్ మృతదేహం కోసం వచ్చిన ఆయన సోదరుడు వినోద్ చౌహాన్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన ఆయన మృతదేహాన్ని ఇచ్చేవరకూ ఎక్కడ ఉండాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘అజయ్ మృతి చెందిన విషయం ఆలస్యంగా తెలిసింది. డీఎన్‌ఏ పరీక్షల కోసం ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చాను. కూలి పనులు చేసుకుని జీవించే వాళ్లం. మృతదేహాన్ని ఎప్పుడు అప్పగిస్తారో తెలియదు. అంతవరకు ఎక్కడ ఉండాలో తెలియడం లేదు. ప్రభుత్వాధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు’’ అని వినోద్ ఆవేదన వ్యక్తం చేశారు.
 
 నిలకడగా క్షతగాత్రుల ఆరోగ్యం..
 ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అపోలో డీఆర్‌డీవో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో యోగేష్ గౌడ ఆరోగ్యం మెరుగుపడినట్లు ఆస్పత్రి అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ సమి తెలిపారు. ఆయనకు అమర్చిన వెంటిలేటర్‌ను శుక్రవారం ఉదయం తొలగించామని, ఆయన స్వయంగా శ్వాస తీసుకోగలుగుతున్నారని పేర్కొన్నారు. ఇక ప్రమాదంలో స్వల్పంగా గాయపడిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన జైసింగ్‌ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. క్లీనర్ అయాజ్‌పాషాతో పాటు క్షతగాత్రులు శ్రీకర్, రాజేష్, మజార్‌పాష ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందన్నారు.
 

మరిన్ని వార్తలు