మెడకు చుట్టుకుంటుందా?

29 Aug, 2016 21:56 IST|Sakshi
మెడకు చుట్టుకుంటుందా?

హైదరాబాద్: అంతా సజావుగా సర్దుకుపోయిందనుకుంటున్న ఓటుకు నోట్ల కేసు మరోసారి తెరమీదకు రావడంతో తెలుగుదేశం వర్గాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. కేసును పునర్విచారణ చేయాలని ఏసీబీ న్యాయస్థానం ఆదేశించిన నేపథ్యంలో  ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు ఖంగుతిన్నారు. వెంటనే సన్నిహిత అధికారులను పిలిచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. సన్నిహిత న్యాయవాదులతో సంప్రదింపులు జరిపారు. అంతా అయిపోయిందనుకున్న సమయంలో కోర్టు నుంచి ఇలాంటి ఆదేశాలు వెలువడటం ఆయన జీర్ణించుకోలేకపోతున్నారని తెలిసింది. చివరకు ఈ కేసు మెడకు చుట్టుకుంటుందా అన్న భయం కూడా ఉందని ఆ పార్టీ నేతల్లో కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఓటుకు నోట్ల కేసులో ఏసీబీ చార్జిషీటు దాఖలు చేసిన నేపథ్యంలో ఇక ఎలాంటి సమస్యలు రావని భావిస్తున్న తరుణంలో కోర్టు కేసును పునర్విచారణకు ఆదేశించడం చంద్రబాబును ఇరకాటంలోకి నెట్టింది. నిజానికి ఓటుకు నోట్లు కేసులో మొదట్లో విచారణ చురుకుగా సాగినప్పటికీ ఆ తర్వాత కాలంలో వేగం బాగా తగ్గింది. దానికి తోడు ఈ కేసులో చంద్రబాబు ముద్దాయిగా తేల్చడానికి సంబంధించి ఫోరెన్సిక్ నివేదిక చాలా కాలం బయటకు రాలేదు. ఫోరెన్సిక్ నివేదిక పేరుతో ఇంతవరకు ఈ కేసులో చంద్రబాబు నాయుడిని అధికారులు ప్రశ్నించలేకపోయారు. అయితే ఫోరెన్సిక్ నివేదిక కోర్టు ముందుంచిన తర్వాత కూడా కేసులో ఎలాంటి ముందడుగు పడలేదు. దానిపై అప్పట్లోనే రకరకాల అనుమానాలు వ్యక్తమయ్యాయి.

తాజాగా ఫోరెన్సిక్ నివేదికపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కోర్టును ఆశ్రయించడం, కోర్టు ఆయన వాదనతో ఏకీభవించి కేసు పునర్విచారణకు ఆదేశించడంతో చంద్రబాబు వర్గీయుల్లో గుబులు మొదలైంది. అందులోనూ ఫోరెన్సిక్ నివేదికను పరిగణలోకి తీసుకుని విచారణ జరగాలని కోర్టు కోరడం చంద్రబాబు నాయుడుకు ఏమాత్రం మింగుడు పడటం లేదని తెలిసింది. ఈ విషయంలో తదుపరి చర్యలు ఏం తీసుకోవాలన్న దానిపై ఆయన న్యాయకోవిదులతో సమాలోచనలు జరిపినట్టు తెలిసింది.

ఏసీబీ కోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయిస్తే చంద్రబాబు విచారణకు సిద్ధపడటం లేదని తెలిసిపోతుంది. అలాగని పై కోర్టులను ఆశ్రయించని పక్షంలో కేసు మెడకు చుట్టుకునే ఆస్కారం ఉంది... ఏ కోణంలో చూసినా చంద్రబాబుకు ఇబ్బందికరమైన పరిస్థితే తలెత్తిందని సీనియర్ టీడీపీ నేత ఒకరు చెప్పారు. ఓటుకు కోట్ల కేసులో తనకేమాత్రం సంబంధం లేదని, ఈ కేసులో తాను దోషి కాదని చంద్రబాబు నిజాయితీగా నిరూపించుకోవలసిన అవసరం ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. కోర్టు తీర్పు ప్రతి అందిన తర్వాత తదుపరి చర్యలపై నిర్ణయం ఉంటుందని ముఖ్యమంత్రి సన్నిహిత అధికారి ఒకరు చెప్పారు.

మరిన్ని వార్తలు