పార్లమెంటుకు గైర్హాజరు కావద్దు

22 Mar, 2017 01:25 IST|Sakshi
పార్లమెంటుకు గైర్హాజరు కావద్దు

పార్టీ ఎంపీలకు ప్రధాని మోదీ హెచ్చరిక
బీజేపీ వ్యవస్థాపక దినోత్సవం ఘనంగా జరపాలని సూచన


న్యూఢిల్లీ: పార్లమెంటు సమావేశాలకు హాజరుకాని పార్టీ ఎంపీలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మంగళవారం జరిగిన బీజేపీ పార్లమెంటరీ సమావేశంలో మాట్లాడిన ప్రధాని మోదీ.. తరచుగా అధిక సంఖ్యలో బీజేపీ ఎంపీలు సభకు హాజరుకావడం లేదని, కోరం కూడా లేకపోతున్న కారణంగా సభా కార్యక్రమాలు ఆలస్యం అవుతున్నాయని అన్నారు. పార్లమెంటు సమావేశాలకు ఒక్కరోజు కూడా గైర్హాజరవ్వకుండా రావాలని.. నిర్లక్ష్యం చేయవద్దని పార్టీ ఎంపీలను హెచ్చరించారు.

ఇకపై తాను ఎప్పుడంటే అప్పుడు ఎవరినైనా పిలవొచ్చని.. ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉండాలని, ఆ మేరకు తనకు హామీ ఇవ్వాలని మోదీ వారిని అడిగారు. ‘పార్లమెంటుకు హాజరవడం ఎంపీల కనీస బాధ్యత.. నేను చాలా పనులు చేయగలను.. కానీ మీకు బదులుగా ఉభయసభలకు హాజరుకాలేను’ అని ఆయన అన్నారు. ఉభయ సభల్లో తగినంత మంది సభ్యులు లేరని, సోమవారం కూడా పార్లమెంటు ఉభయ సభల్లో కోరం లేదని, దీనివల్ల సభ నడిపించే పరిస్థితి లేకుండా తయారైందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్‌ కుమార్‌ వెల్లడించడంతో మోదీ ఈ విధంగా స్పందించారు. సభకు హాజరు కావాలని వేరే వారితో చెప్పించుకునే పరిస్థితి ఉండకూడదని, అది వారి వ్యక్తిగత బాధ్యత అని మోదీ పేర్కొన్నారు.

వాడవాడలా అంబేడ్కర్‌ శతజయంతి
వచ్చేనెల 6న పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని, 14న రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ జయంతిని వాడవాడలా ఘనంగా జరపాలని మోదీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలకు పిలుపునిచ్చినట్లు మంత్రి అనంతకుమార్‌ తెలిపారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ చిన్న వ్యాపారులు, ఉద్యోగులు, శ్రామికులను కలసి భీమ్‌ యాప్‌ను వినియోగించేలా చేయాలని, అందరిలో జీఎస్టీపై అవగాహన పెరిగేలా చూడాలని మోదీ ఎంపీలకు చెప్పినట్లు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు