‘వక్ఫ్‌’ ఫిర్యాదులపై విచారణ కమిటీ

8 Jan, 2017 13:57 IST|Sakshi

న్యూఢిల్లీ: వక్ఫ్‌ ఆస్తులకు సంబంధించిన ఫిర్యాదుల పరిశీలన నిమిత్తం సుప్రీంకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తితో కేంద్రం ఏక సభ్య కమిషన్‌ను నియమించినట్లు కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ తెలిపారు. ఇక్కడ జరిగిన ఆలిండియా వక్ఫ్‌ కాన్ఫరెన్స్‌లో మంత్రి మాట్లాడారు. వక్ఫ్‌ ఆస్తుల వ్యవహారాలపై రాష్ట్రాలు కూడా ముగ్గురు సభ్యులతో కూడిన ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. మాఫియా చెర నుంచి వక్ఫ్‌ భూములకు విముక్తి కల్పించేందుకు కేంద్రం చర్యలు ప్రారంభించిందని తెలిపారు.

వక్ఫ్‌ ఆస్తులను, భూములను ముస్లింల సామాజిక, ఆర్థిక పురోభివృద్ధికి ఉపయోగించాలని కల్పించాలని సూచించారు. దేశవ్యాప్తంగా సుమారు 4,49,314 రిజిస్టర్డ్, అన్‌రిజిస్టర్డ్‌ ఆస్తులు ఉన్నాయని, వాటి వార్షిక ఆదాయం రూ.163 కోట్లు, స్థిరాస్తుల విలువ 1.2 లక్షల కోట్లు ఉంటుందని పేర్కొన్నారు. ఈ వక్ఫ్‌ ఆస్తుల ద్వారా ఏడాదికి 12 వేల కోట్ల ఆదాయం రాబట్టవచ్చని, వాటిని ముస్లింల అభివృద్ధికి ఖర్చు చేస్తే వారి జీవితాల్లో గణనీయమైన మార్పులు సంభవించే అవకాముందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రాలు మైనారిటీల పాఠశాలలు, కాలేజీలు, నైపుణ్య కేంద్రాలు, ఆస్పత్రుల నిర్మాణాలు చేపడితే కేంద్రం సహకరిస్తుందని మంత్రి వెల్లడించారు.

మరిన్ని వార్తలు