ఆ నేతకు తప్పని ఇంటిపోరు...

10 Jan, 2016 16:18 IST|Sakshi
ఆ నేతకు తప్పని ఇంటిపోరు...

తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యవర్గంలో ఇటీవలే కీలక బాధ్యతలు చేపట్టిన ఓ నేతకు ఇంటిపోరు తప్పటం లేదట. ఇంటిపోరు నుంచి తప్పించుకునే మార్గం అన్వేషించే పనిలో ఆయన పడ్డారట. ఇపుడు పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్‌టీ ఆర్ భవన్‌లో ఇదే హాట్ టాపిక్ అయ్యింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు కుమారుడు కల్వకుంట్ల తారకరామారావు విదేశాల్లో విద్యనభ్యసించి అక్కడే ఉద్యోగం చేసి రాష్ట్రానికి తిరిగొచ్చారు. ఆ తరువాత రాజకీయాల్లోకి వచ్చిన ఆయన అందులో పట్టు సాధించారు. పలుమార్లు ఎమ్మెల్యేగా గెలవటంతో పాటు తెలంగాణ రాష్ట్ర తొలి మంత్రివర్గంలో సభ్యుడయ్యారు. కీలక శాఖలను పర్యవేక్షి స్తున్నారు.

తెలుగు, ఆంగ్లం, ఉర్ధూ, హిందీ భాషల్లో మంచి పట్టు సాధించారు. ఆ భాషల్లో ఆయన అనర్గళంగా మాట్లాడతారు. ఆయనతో టీడీపీ కీలక నేతను ఇంటిలో వారు పోల్చి చూస్తున్నారట. ఆ పోలికలో ఇద్దరికీ అసలు సామీప్యత కూడా కుదరటం లేదు. ఇద్దరి భాష, ఆహార్యంలో ఎంతో వ్యత్యాసం కనిపిస్తోందట. దీంతో మీరు ఎట్టి పరిస్థితుల్లో కేటీఆర్‌లా పేరు తెచ్చుకోవాలి, ప్రచారం పొందాలని చెప్తున్నారట. ఈ ముఖ్య నేత కూడా విదేశాల్లో విద్యను అభ్యసించటంతో పాటు ఆ తరువాత సొంత కంపెనీలో కీలకపాత్ర పోషించారు.

తాజాగా రాజకీయాల్లోకి వచ్చారు. కేటీఆర్‌కు, మీకు అన్ని విషయాల్లో పోలిక ఉంది. అలాంటపుడు ఆయనలా అన్ని భాషలు అనర్గళంగా ఎందుకు మాట్లాడలేకపోతున్నారు, ఎందుకు పేరు తెచ్చుకోలేకపోతున్నారు, జనంలోకి ఎందుకు చొచ్చుకెళ్లడం లేదు... కారణాలేంటో అధ్యయనం చేసి పరిష్కారమార్గం అన్వేషించండి అని ఇంట్లో వారు పోరుతుండటంతో ఇపుడు కీలకనేత అదే పనిలో పడ్డారట.

మరిన్ని వార్తలు