వాచీల కొనుగోళ్లలో వరంగల్ టాప్

5 Jun, 2015 10:59 IST|Sakshi
వాచీల కొనుగోళ్లలో వరంగల్ టాప్

అంతర్జాతీయ బ్రాండ్ల వాటా 65%
ఈ-బే రిటైల్ ఎక్స్‌పోర్ట్ బిజినెస్ హెడ్ నవీన్

 
 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఆన్‌లైన్‌లో వాచీలను కొనుగోలు చేయడంలో చిన్న నగరాల హవా నడుస్తోంది. ఈ-కామర్స్ కంపెనీ ఈ-బే వాచీల అమ్మకాల్లో టాప్-5 రాష్ట్రాల్లో మెట్రో నగరం ఒక్కటి కూడా లేకపోవడం గమనార్హం. రాష్ట్రాలవారీగా చూస్తే కర్ణాటకలో హసన్, గుల్బర్గా, రాయిచూర్, మహారాష్ట్రలో లాతూర్, కరద్, సాంగ్లి, ఢిల్లీలో నోయిడా, గుర్‌గావ్, ఫరీదాబాద్, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌లో వరంగల్, కాకినాడ, నర్సాపూర్, తమిళనాడులో నాగర్‌కోయిల్, సెంబాకం, దిండిగల్‌లు ముందు వరుసలో ఉన్నాయి. ఈ-బే మొత్తం వాచీల అమ్మకాల్లో వీటి వాటా 60 శాతంగా ఉందని కంపెనీ రిటైల్ ఎక్స్‌పోర్ట్స్, లైఫ్‌స్టైల్ విభాగం హెడ్ నవీన్ మిస్ట్రీ తెలిపారు. ఆన్‌లైన్‌లో అతిపెద్ద వాచ్‌మాల్‌ను ప్రారంభించిన సందర్భంగా గురువారమిక్కడ మీడియాతో మాట్లాడారు.

 టాప్‌లో అర్మానీ..
 కంపెనీ విక్రయిస్తున్న వాచీల్లో అంతర్జాతీయ బ్రాండ్లు 65 శాతం కైవసం చేసుకున్నాయి. టాప్-5 బ్రాండ్లలో అర్మానీ, ఫాసిల్, గెస్, టైటాన్, ఫాస్ట్‌ట్రాక్‌లు ఉన్నాయి. వాచ్ పరిశ్రమ భారత్‌లో 10 శాతం వార్షిక వృద్ధి రేటుతో రూ.5,250 కోట్లుంది. ఇందులో ఆన్‌లైన్ వాటా 35 శాతం వృద్ధితో రూ.200 కోట్లుంది. ఈ-బే 21 శాతం వాటాను దక్కించుకుందని కంపెనీ కార్పొరేట్ కమ్యూనికేషన్స్ హెడ్ గిరీష్ హురియా తెలిపారు. ‘ఈ-బే సైట్లో వాచీలకు పురుషులు సగటున రూ.6,300, మహిళా కస్టమర్లు రూ.3,150 ఖర్చు చేస్తున్నారు. 44 శాతం కస్టమర్లు మొబైల్ ద్వారా ఆర్డర్లు ఇస్తున్నారు. కనీసం 30 శాతం డిస్కౌంట్‌తో 200 బ్రాండ్లలో 65 వేలకుపైగా మోడళ్లను వాచ్‌మాల్‌లో అందుబాటులోకి తెచ్చాం’ అని తెలిపారు. ఈ-బే మొత్తం ఆన్‌లైన్ కస్టమర్లలో 43 శాతం మంది మహిళలు ఉంటున్నారని చెప్పారు.

మరిన్ని వార్తలు