ప్రధాని రూ. 1000 కోట్లు ఆఫర్ చేశారు

27 Apr, 2017 19:28 IST|Sakshi

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్, తెహ్రెక్-ఇ-ఇన్‌సాఫ్‌ చీఫ్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ ఆ దేశ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌పై సంచలన ఆరోపణలు చేశారు. పనామా పత్రాల లీక్‌ వ్యవహారంపై మాట్లాడకుండా ఉంటే 1000 కోట్ల రూపాయలు ఇస్తానని షరీఫ్‌ ఆఫర్‌ చేశారని ఇమ్రాన్‌ బాంబు పేల్చారు. అయితే ప్రధాని నేరుగా ఈ ప్రతిపాదన తీసుకురాలేదని, పంజాబ్‌ ముఖ్యమంత్రి షాబాజ్‌ షరీఫ్‌ స్నేహితుడు ఒకరు ఈ ఆఫర్‌ చేసినట్టు తెలిపారు.

రెండు వారాల క్రితం ఆ వ్యక్తి తనను కలసి ఈ విషయంపై మాట్లాడినట్టు ఇమ్రాన్‌ చెప్పారు. పనామా గేట్‌ విషయంలో మౌనంగా ఉండాలని ప్రధాని షరీఫ్‌ కోరినట్టు ఆయన తనకు చెప్పారని వెల్లడించారు. వెయ్యి కోట్ల రూపాయల ఆఫర్‌ ఆరంభం మాత్రమేనని, షరీఫ్‌ పట్ల సానుకూల ధోరణితో వ్యవహరిస్తే మరింత మొత్తం ఇస్తారని చెప్పినట్టు ఇమ్రాన్‌ తెలిపారు. కాగా ఈ ఆరోపణలను పంజాబ్ సీఎం షాబాజ్‌ షరీఫ్‌ తోసిపుచ్చారు. ఇమ్రాన్‌ అబద్ధాలకోరనే రికార్డు ఉందని విమర్శించారు. తాను ఈ విషయాన్ని కోర్టులో సవాల్‌ చేస్తానని హెచ్చరించారు.

మనీలాండరింగ్‌ ద్వారా ప్రధాని నవాజ్‌ షరీఫ్‌, ఆయన కుటుంబసభ్యులు విదేశాల్లో ఆస్తులు కూడబెట్టారంటూ పనామా పత్రాల్లో వెలుగుచూసిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ సాగుతోంది.

మరిన్ని వార్తలు