పచ్చబాస్ బాగోతం అందరికీ తెలుసు

12 Jul, 2015 06:50 IST|Sakshi
పచ్చబాస్ బాగోతం అందరికీ తెలుసు

* టీటీడీపీపై ఎంపీ కవిత, మంత్రి జూపల్లి మండిపాటు
* పాలమూరుకు అడ్డం కాదని కేంద్రానికి లేఖ రాయాలి
* కేసీఆర్‌ను ఆవహించింది తెలంగాణ ఆత్మ మాత్రమే

 
సాక్షి, హైదరాబాద్: ‘పచ్చ బాస్ బాగోతం అందరికీ తెలుసు. గతంలో నీటి వనరుల విషయంలో తెలంగాణకు తీరని అన్యాయం చేసిండు... పులిచింతల, దేవాదుల ప్రాజెక్టుల్లో ఈపీసీ పేరిట కమిషన్ల విధానానికి తెరలేపిండు... ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్లను ప్రైవేటు పరం చేసిన చరిత్రా ఆయనదే.. ఇప్పుడు తెలంగాణలో కొత్త ప్రాజెక్టులు కమీషన్ల కోసమే చేపడుతున్నరని విమర్శలు చేస్తున్నరు.. మీలా కమీషన్లు తీసుకునే సంస్కృతి మాది కాదు.’ అంటూ తెలంగాణ టీడీపీ నేతలపై ఎంపీ కవిత మండిపడ్డారు. పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలసి శనివారం తెలంగాణ భవన్‌లో ఆమె విలేకరులతో మాట్లాడారు.  ‘నిజామాబాద్ జిల్లాకు చంద్రబాబు  అన్యాయం చేశాడు. హైదరాబాద్‌కు సింగూ రు జలాల్ని తరలించి నిజాం సాగర్ ప్రాజెక్టు కింద 2.70 లక్షల ఎకరాలను ఎండబెట్టాడు. పులిచింతల ప్రాజెక్టు కోసం నల్లగొండ జిల్లాలో 10 వేల ఎకరాల భూముల్ని లాక్కున్నడు’ అని కవిత ఆరోపించారు.
 
 మహబూబ్‌నగర్ జిల్లాలో 40 లక్షల ఎకరాల ఆయకట్టు సాగుకు అనుకూలంగా ఉన్నా.. ఇప్పుడున్న ప్రాజెక్టుల కింద 7, 8 లక్షల ఎకరాలకు మించి నీరందడం లేదన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల పరిధిలో 10 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందుతుందన్నారు. అయినా పాలమూరు జిల్లా ప్రతినిధులు బాబుకు వంత పాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్‌డీఎస్ ఆధునికీకరణ పనులు కేఈ కృష్ణమూర్తి అడ్డుకుంటున్నా టీటీడీపీ నేతలు భయపడి నోరు మెదపడం లేద న్నారు. కొత్త ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వాలంటూ మీ చిరకాల మిత్రుడు కిరణ్‌కుమార్‌రెడ్డి అప్పట్లో లేఖ రాశారన్నారు. కేసీఆర్‌ను ఆవహించింది తెలంగాణ ఆత్మ మాత్రమేనన్నారు. ఏడాది పొడవునా 160 టీఎంసీల నీటిని తీసుకోవచ్చనే ఉద్దేశంతోనే ప్రాణహిత- చేవెళ్ల రిజ ర్వాయర్‌ను కాళేశ్వరంనకు మార్చారన్నారు. తెలంగాణ ప్రజల పక్షాన నిలబడేందుకే గాంధీభవన్ నుంచి తెలంగాణ భవన్‌కు వచ్చానని జూపల్లి అన్నారు.

మరిన్ని వార్తలు