యుద్ధంపై పాక్ ప్రధాని అధికారిక ప్రకటన

5 Oct, 2016 17:53 IST|Sakshi
యుద్ధంపై పాక్ ప్రధాని అధికారిక ప్రకటన

ఇస్లామాబాద్: ఉడీ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్ ఆక్రమిత కశ్మీర్ లో ఇండియన్ ఆర్మీ జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత ఇరు దేశాల్లో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ కీలక ప్రకటన చేశారు. బుధవారం పాకిస్థాన్ పార్లమెంట్ ను ఉద్దేశించి మాట్లాడిన ఆయన.. ఉడీ ఉగ్రదాడితో పాకిస్థాన్ కు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. ఉడీ దాడి జరిగిన కొద్ది గంటల్లోపే ఎలాంటి ఆధారాలు లేకుండా భారత్.. పాకిస్థాన్ ను నిందించిందని ఆక్షేపించారు.

పాకిస్థాన్ ను శాంతికాముక దేశంగా అభివర్ణించిన నవాజ్.. తాము భారత్ తో యుద్ధం చేయాలని కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. కీలకమైన కశ్మీర్ సహా ఇండియాతో నెలకొన్న అన్ని సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని భావిస్తున్నట్లు సభకు చెప్పారు. అయితే తమ ప్రమేయం లేకుండా ఎదురయ్యే విపత్కర పరిస్థితులను తిప్పికొట్టేందుకు పాక్ సైన్యం సిద్ధంగా ఉందన్నారు.

మరిన్ని వార్తలు