కోర్టు తీర్పుతో మమ్మల్ని వెంటాడుతున్నారు!

22 Mar, 2017 13:47 IST|Sakshi
కోర్టు తీర్పుతో మమ్మల్ని వెంటాడుతున్నారు!

న్యూఢిల్లీ: నారద స్టింగ్‌ ఆపరేషన్‌పై సీబీఐ దర్యాప్తు జరపాలని న్యాయస్థానాలు ఆదేశించిన నేపథ్యంలో ఈ స్టింగ్‌ ఆపరేషన్‌ నిర్వహించిన జర్నలిస్టులకు వేధింపులు, బెదిరింపులు ఎదురవుతున్నాయి. కోర్టు తీర్పు వెలువడిన తర్వాత కొందరు వ్యక్తులు తమను వెంటాడుతున్న విషయాన్ని గుర్తించామని తాజాగా నారద న్యూస్‌ ఆన్‌లైన్‌ పోర్టల్‌ సీఏవో ఏంజెల్‌ అబ్రహం పేర్కొన్నారు. ఈ స్టింగ్‌ ఆపరేషన్‌లో పాల్గొన్న నారద న్యూస్‌ కు చెందిన పాత్రికేయులందరికీ ఇదేవిధంగా బెదిరింపులు, వెంటాడటాలు ఎదురవుతున్నాయని ఆమె చెప్పారు.

పలువురు తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతలు ముడుపులు తీసుకుంటూ నారద న్యూస్‌ స్టింగ్‌ ఆపరేషన్‌లో అడ్డంగా దొరికిపోవడం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో ఈ స్టింగ్‌ ఆపరేషన్‌పై ప్రాథమిక విచారణ చేయాలని కలకత్తా హైకోర్టు సీబీఐని ఆదేశించింది. స్టింగ్‌ ఆపరేషన్‌కు సంబంధించిన సమాచారాన్ని, వస్తువులను 24 గంటల్లో స్వాధీనం చేసుకోవాలని, 72 గంటల్లో ప్రాథమిక విచారణ పూర్తి చేయాలని ధర్మాసనం సీబీఐని ఆదేశించింది. ప్రాథమిక విచారణ పూర్తయిన తర్వాత అవసరమైతే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని, తర్వాత దర్యాప్తు కొనసాగించాలని పేర్కొంది. అయితే, హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ తృణమూల్‌ అధినేత్రి, బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ సుప్రీంకోర్టుకు వెళ్లినా.. అక్కడ ఆమెకు చుక్కెదురైంది.

గతేడాది పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల ముందు నారద స్టింగ్‌ ఆపరేషన్‌కు సంబంధించిన వీడియోలను పలు వార్తా చానళ్లు ప్రసారం చేశాయి. మొదట ఈ వీడియోలు ‘నారదన్యూస్‌.కామ్‌’లో ప్రసారమయ్యాయి. దీనిలో కొందరు నేతలు డబ్బులు తీసుకుంటున్నట్లుగా దృశ్యాలు ఉన్నాయి. కాగా, ఇవి ట్యాంపర్‌ చేసిన వీడియోలు కావని చండీగఢ్‌లోని సెంట్రల్‌ ఫొరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరెటరీ (సీఎఫ్‌ఎస్‌ఎల్‌) ఇచ్చిన నివేదికను ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిలో మంత్రులు, ఎంపీలు, సీనియర్‌ నేతలు ఉన్నందువల్ల రాష్ట్ర సంస్థలు కాకుండా సీబీఐ అయితేనే స్వతంత్రంగా దర్యాప్తు నిర్వహించగలదని కోర్టు పేర్కొంది.

మరిన్ని వార్తలు