'దేశ ప్రజల ముందు మేం నిరూపించుకున్నాం'

16 Mar, 2017 13:13 IST|Sakshi
'దేశ ప్రజల ముందు మేం నిరూపించుకున్నాం'

పణజి: 'మాకు 23 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. అసెంబ్లీ సాక్షిగా జరిగిన బలపరీక్షలో ఇదే విషయాన్ని మేం దేశ ప్రజలకు చాటాం' అని గోవా ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్‌ అన్నారు. గురువారం గోవా అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో విజయం సాధించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.

'కాంగ్రెస్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ తమకు మెజారిటీ ఉందని చెప్తున్నారు. కానీ అది ఉత్తిమాటేనని తేలిపోయింది. మొదటినుంచి వారి వద్ద ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీ లేదు' అని పారికర్‌ అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శిగా దిగ్విజయ్‌ సింగ్‌ దిగిపోవాలన్న డిమాండ్‌ ఊపందుకోవడం వల్లే ఆయన తమ వద్ద సంఖ్యాబలముందనే ఊహాగానాలను తెరపైకి తెచ్చిఉంటారని విమర్శించారు. తమది సంకీర్ణ ప్రభుత్వమని, కాబట్టి సంకీర్ణ పక్షాలతో చర్చించి.. ఉప ముఖ్యమంత్రి నియమాకంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ప్రభుత్వ ఏర్పాటు విషయంలో బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారని, పచ్చకామర్లు వచ్చినవాడికి లోకమంత పచ్చగా కనిపించినట్టు ప్రత్యర్థులు ఆరోపణలు ఉన్నాయన్నారు. ఎమ్మెల్యేలపై తాము ఎటువంటి ఒత్తిడి పెట్టలేదని, ప్రతిపక్షాల తరహాలో వారిని హోటళ్లలో ఉంచడం, గుర్తుతెలియని ప్రదేశాలకు తీసుకెళ్లడంలాంటివి చేయలేదని, ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగా వచ్చి ఓటు వేశారని పారికర్‌ పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు