పాకిస్థానే ఎక్కువ నష్టపోయింది!

2 Nov, 2016 15:02 IST|Sakshi
పాకిస్థానే ఎక్కువ నష్టపోయింది!
వాస్తవాధీన రేఖ (ఎల్‌వోసీ), అంతర్జాతీయ సరిహద్దులు (ఐబీ) మీదుగా పౌరులే లక్ష్యంగా విచ్చలవిడిగా కాల్పులు జరుపుతున్న పాకిస్థాన్‌కు దీటుగా బదులిస్తున్నామని బీఎస్‌ఎఫ్‌ ఐజీ డీకే ఉపాధ్యాయ బుధవారం వెల్లడించారు. పాక్‌ సైన్యం మన పౌరులు లక్ష్యంగా కాల్పులు, షెల్లింగ్‌ దాడులతో విరుచుకుపడుతుండగా.. తాము కేవలం సైనికులే లక్ష్యంగా నిర్దేశితమైన కచ్చితమైన దాడులు జరుపుతున్నామని ఆయన వెల్లడించారు.

భారత సైన్యం ఎప్పుడూ కూడా అటువైపున్న సామాన్య పౌరులను లక్ష్యంగా చేసుకొని కాల్పులు జరుపలేదని, కాల్పులతో పెట్రేగుతున్న పాక్‌ రేంజర్లు లక్ష్యంగా కచ్చితమైన ప్రతి దాడి జరుపుతున్నట్టు ఆయన వెల్లడించారు. తమ ప్రతిదాడిలో పెద్ద ఎత్తున పాక్‌ సైనిక పోస్టులు ధ్వంసమయ్యాయని, పాక్‌ సైన్యం పెద్దసంఖ్యలో నష్టపోయిందని చెప్పారు. ‘మేం వారి పోస్టుల లక్ష్యంగా కాల్పులు జరిపాం. వారివైపు నష్టం ఎక్కువగా సంభవించింది. అయితే, ఎంతమంది చనిపోయి ఉంటారనే సంఖ్యను మేం ధ్రువీకరించలేం’ అని ఆయన బుధవారం విలేకరుల సమావేశంలో తెలిపారు.
 
 
పాక్‌ సైన్యం విచ్చలవిడి కాల్పులతో మంగళవారం​ ఎనిమిది మంది భారత పౌరులను పొట్టనబెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ కాల్పుల్లో మరో 22మంది చనిపోయారు. దీంతో ప్రతిదాడులకు దిగిన భారత సైన్యం దీటుగా దెబ్బకొడుతూ 14 పాక్‌ సైనిక పోస్టులను ధ్వంసం చేసింది. ఈ కాల్పుల్లో ఇద్దరు పాక్‌ రేంజర్లు చనిపోయినట్టు తెలుస్తోంది.
  
మరిన్ని వార్తలు