యూపీఏ ప్రభుత్వంపై అవిశ్వాసానికి మద్దతిస్తాం: ఎస్పీ

13 Dec, 2013 20:48 IST|Sakshi

న్యూఢిల్లీ: లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం చేపడితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేస్తామని సమాజ్‌వాది పార్టీ ప్రకటించింది. 22 మంది ఎంపీలున్న ఎస్పీ.. యూపీఏకు బయటి నుంచి మద్దతు ఇస్తున్న సంగతి తెలిసిందే. లోక్‌పాల్ బిల్లు విషయంలో ప్రభుత్వంపై ఈ పార్టీ తీవ్ర అసంతృప్తితో ఉంది. ప్రభుత్వంపై అవిశ్వాసం కోరుతూ సీమాంధ్రకు చెందిన ఆరుగురు కాంగ్రెస్ ఎంపీలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీలు, టీడీపీ ఎంపీలు స్పీకర్‌కు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

 

దీనిపై ఓటింగ్ జరగాలంటే కనీసం 50 మంది ఎంపీల మద్దతు కూడగట్టాల్సి ఉంది. ‘‘ప్రభుత్వంపై సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ ఇచ్చిన నోటీసులకు మేం మద్దతు ఇవ్వం. కానీ లోక్‌సభలో అవిశ్వాసంపై ఓటింగ్ జరిగితే మాత్రం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేస్తాం’’ అని ఎస్పీ ప్రధాన కార్యదర్శి రామ్‌గోపాల్ యాదవ్ చెప్పారు. తమ పార్టీ చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు వ్యతిరేకమని ఆయన స్పష్టం చేశారు.
 

మరిన్ని వార్తలు