'అ‍న్నాడీఎంకేను మళ్లీ వెనక్కి తెస్తాం'

24 Feb, 2017 14:46 IST|Sakshi
'అ‍న్నాడీఎంకేను మళ్లీ వెనక్కి తెస్తాం'
తమిళనాడులో రాజకీయాలు రోజుకో కొత్త మలుపుతిరుగుతున్నాయి. అన్నాడీఎంకే నుంచి బయటికి గెంటివేయబడ్డ మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, మళ్లీ తమ పార్టీని తిరిగి వెనక్కి తెచ్చుకుంటామని వాగ్దానం చేశారు. పోయెస్ గార్డెన్ నుంచి జయలలిత బయటికి గెంటివేయబడ్డ కుటుంబం ఇప్పుడు అన్నాడీఎంకేలో చక్రాలు తిప్పుతుందని, వారి చేతుల్లోంచి పార్టీని బయటపడేస్తానని పన్నీర్ సెల్వం చెప్పారు. జయలలిత మరణం గురించి అందరిలో ఓ అనుమానం ఉందని, ఆమె మరణానికి సంబంధించిన మిస్టరీ గురించి ప్రతిఒక్కరూ అడుగుతున్నారని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఆమె మరణం గురించి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
 
తమ అతిపెద్ద చాలెంజ్ 'ధర్మ యుద్ధం'. కచ్చితంగా ధర్మం గెలుస్తుందన్నారు. ఎంజీఆర్ మృతి తర్వాత జయలలిత చాలా సమస్యలను ఎదుర్కొన్నారని, అన్నాడీఎంకేను ఎలాంటి కుటుంబ రాజకీయాలు లేకుండా అమ్మ తీర్చిదిద్దారని చెప్పారు. కానీ ప్రస్తుతం తమిళ ప్రభుత్వం, పార్టీ ఒక కుటుంబం చేతిలోకి వెళ్లిపోయాయని ఆందోళన వ్యక్తంచేశారు. అన్నాడీఎంకేలో శశికళ కుటుంబం మళ్లీ చక్రాలు తిప్పడం ప్రారంభించిందని ఇప్పటికే పలువురి నుంచి అసహనం వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న శశికళ, తన అక్క కొడుకు దినకరన్ కు పార్టీలో కీలక పదవి కట్టబెట్టడంతో  కార్యకర్తల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. 
>
మరిన్ని వార్తలు